Bandi Sanjay: విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న ఏబీవీపీ నాయకులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు.
పోలీసుల అమానుషత్వం.. రెడ్ కార్పెట్ సంస్కృతి
శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు క్రూరంగా కొట్టడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలిపితే రెడ్ కార్పెట్ పరిచి, హక్కుల కోసం ప్రశ్నించే ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలపై గొడ్డును బాదినట్లు విరుచుకుపడటం ఏంటని ప్రశ్నించారు. కాళ్ళు, చేతులు విరిగేలా అమానుషంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై మండిపడుతూ.. ప్రశ్నించే గొంతులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు.. విద్యార్థుల భవిష్యత్తు
రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు రాక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఆపివేయడంతో.. విద్యార్థులు పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు సాధించలేక చివరికి అడ్డాకూలీలుగా మారే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదా అని నిలదీశారు.
డిమాండ్లు.. కాంగ్రెస్ సర్కార్ కు హెచ్చరిక
తక్షణమే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న జీవో నంబర్ 9ని వెంటనే రద్దు చేయాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే కాంగ్రెస్ మెడలు వంచి, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజాక్షేత్రంలో అంగీకరించేది లేదని, విద్యార్థి లోకంతో కలిసి ఉధృత పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Also Read: రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!