Free Bus: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు (పురుషులు, మహిళలకు) ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. రవాణా శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ పథకం తక్షణమే అమలులోకి రానుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం ఉన్న సదరం సర్టిఫికేట్ లేదా స్మార్ట్ కార్డుల ఆధారంగా ఈ ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.భవిష్యత్తులో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ ఆధారిత ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్’లను రూపొందించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇకగతంలో అంధులకు మాత్రమే 100 శాతం రాయితీ ఉండగా, ఇతర దివ్యాంగులకు కొంతమేర రాయితీ మాత్రమే ఉండేది. కానీ, తాజా జీవో ప్రకారం దివ్యాంగులందరికీ వారి వైకల్యంతో సంబంధం లేకుండా 100 శాతం ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల నిరుపేద దివ్యాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరట కలగనుంది.
Also Read: Hyderabad News: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. నేరుగా వారితో భేటీ, ఆపై కార్యాచరణ
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంతో, అదే స్ఫూర్తితో దివ్యాంగులకు కూడా ఈ ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం వల్ల అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేయనుంది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ ప్రయాణ కష్టాలను గుర్తించి, ఆర్థిక భారాన్ని తగ్గించిన ముఖ్యమంత్రికి రవాణా శాఖకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Als Read: Allu Sirish wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్… వైరల్ అవుతున్న వీడియో !