Seva Sankalp Abhiyan: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట ఈ వేడుకలను ప్రజల మధ్య జరపాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సేవా భావాన్ని ప్రతీ ఒక్కరిలో పెంపొందించడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఆశీర్వాద్ కా దియా.. ప్రతి ఇంటా దీపోత్సవం
ఈ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 17న ‘ఆశీర్వాద్ కా దియా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించి, ప్రధాని మోదీకి ప్రజల ఆశీస్సులు అందించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఉచిత రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, పాఠశాలలు-కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ‘మేరే సప్నో కా భారత్’, ‘సేవా కీ కహానీ’, ‘సేవా జ్యోతి కలశ్ యాత్ర’, ‘సుశాసన్ సేవా సంవాద్’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజా రంజక పాలనను ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్తామని వివరించారు.
సంక్షేమ పథకాలతో మార్పు.. డిజిటల్ విప్లవం
మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తామన్నారు. జనధన్ యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పేద ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని గుర్తుచేశారు. యూపీఐ , డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో భారత్ ఇవాళ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, చిన్న వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు డిజిటల్ సేవలు సులభతరమయ్యాయని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు.
చేతివృత్తులకు, చిన్న వ్యాపారులకు ఆర్థిక ఊతం
సమాజంలో వెనుకబడిన వర్గాలు, చేతివృత్తుల వారిని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పిఎం విశ్వకర్మ, పిఎం స్వనిధి, ముద్రా రుణాల ద్వారా దేశంలో కోట్లాది మంది చేతివృత్తిదారులు, వీధి వ్యాపారులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని చెప్పారు. సేవ, సుశాసనం, ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిన మోదీ గారి 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే ఈ సేవా సంకల్ప్ అభియాన్ మూల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.