
Revanth Reddy: రేవంత్‌రెడ్డి అంటే ఫైర్ బ్రాండ్. రేవంత్ రెడ్డి అంటే చిచ్చర పిడుగు. రేవంత్ రెడ్డి అంటే పవర్. ఎప్పుడూ పులిలా ఉంటారు. ఎల్లప్పుడూ గుండెధైర్యంతో నిలుస్తారు. అలాంటి రేవంత్‌రెడ్డి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఆయన కంచు కంఠం జీరబోయింది. కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. నోట మాట రాలేదు. బాధతో, ఆవేదనతో కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయారు.
మునుపెన్నడూ లేని, మునుపెన్నడూ చూడని.. రేవంత్ కనిపించారు. ఆయన యాటిట్యూడ్‌కు కంప్లీట్ భిన్నంగా మాట్లాడారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చేసి వచ్చాక ఈటల రాజేందర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా తాను సర్వనాశనమై పోతానని అంటూనే.. ఈటల తనపైన చేసిన ఆరోపణలపై బాధతో, కోపంతో చెలరేగిపోయారు. తనను ఎవరూ కొనలేరంటూ.. కేసీఆర్‌పై సర్వంపెట్టి కొట్లాడతానంటూ తేల్చి చెప్పారు. తన ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమేనన్నారు.
ఈ సందర్భంగా ఈటలపై శివాలెత్తారు రేవంత్‌రెడ్డి. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు రాజేంద్ర అంటూ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. నీలాగ కేసులు పెట్టగానే వేరే పార్టీ శరణు కోరలేదన్నారు. కేటీఆర్ ఫాంహౌజ్‌పై పోరాడినందుకు.. 16 రోజులు చర్లపల్లి జైల్లో పెట్టి టార్చర్ చేసినా లొంగలేదని.. అలాంటి తనను పట్టుకుని కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకున్నానని అంటావా? అంటూ ఈటలను కడిగిపారేశారు. జైల్లో చిప్పకూడు తింటే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందోనంటూ ఘాటుగా విమర్శించారు.
భాగ్యలక్ష్మి టెంపుల్‌లో తన ఈ ప్రమాణం రాజకీయం కోసం కాదని.. ఈటల మాటలు తన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఇది తన ఆత్మ గౌరవ పోరాటమంటూ.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు రేవంత్. ఆయన కంట కన్నీళ్లు తిరిగాయి. కాసేపు గొంతు మూగబోయింది.
కేసీఆర్‌పై పోరాటం చేస్తున్న వ్యతిరేక గొంతుకలకు ఈటల ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థంతోనో.. బీజేపీలో గుర్తింపు కోసమో.. తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఈటలకు మంచిది కాదని హెచ్చరించారు. రాజేంద్ర.. దమ్ముంటే నా కళ్లలోకి చూసి మాట్లాడు.. అంటూ సవాల్ చేశారు.
కేసీఆర్‌పై సర్వంపెట్టి కొట్లాడతానని.. నా ఆస్తులన్నీ అమ్మైనా సరే కేసీఆర్‌ను గద్దె దించుతానని.. నా తర్వాత నాలుగు తరాలు సైతం కేసీఆర్‌పైనా కొట్లాడుతూనే ఉంటాయంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు రేవంత్‌రెడ్డి. రాజీ తన రక్తంలో లేదని.. భయం తన ఒంట్లో లేదని.. చివరి రక్తపు బొట్టు వరకూ కేసీఆర్‌పై కొట్లాడతానని రేవంత్‌రెడ్డి సింహగర్జన చేశారు.
