Compensation to Farmers : ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన రైతులు. ఏడాదంతా కష్టపడ్డామా, పంటలు పండించామా అన్నదే వారి లెక్క. ఏమైనా నాలుగు రాళ్లు మిగిలితే.. పిల్లల కోసం కూడబెట్టడం, నష్టాలు వస్తే.. ఒంటి మీద బంగారం కూడా అమ్ముకుని సాగు చేసే కష్ట జీవులు. అలాంటి వారికి.. కష్టాల సాగు కనికరించలేదు. వరుస అప్పులతో నడ్డి విరిచేసింది. చేసేదేం లేక.. నమ్ముకున్న పంటలు నట్టెట ముంచగా… విషమే వారికి దారైంది. ఉరి తాడులే ఉయాలలా మారి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుల్ని తిరిగి చెల్లించలేక.. ఎగ్గొట్టే మనసు లేక చావుకు ఎదురెళ్లారు. అలాంటి వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం… అసలు వాళ్లే రైతులు కాదని, సాగు కష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడలేదంటూ వాదించింది. 2014-2022 మధ్య చోటు చేసుకున్న ఘటనల్లో రైతు కుటుంబాల్ని ఆదుకోవడానికి నిరాకరించింది. తాజాగా వారివి రైతు మరణాలే అని హైకోర్టు కోర్టు తేల్చి.. పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో కదలిక వచ్చింది.
ఎన్ని కష్టాలు ఉంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారు. అయినా.. 2014 నుంచి 2022 మధ్య ప్రభుత్వం మాత్రం కనీస మానవత్వాన్ని మరిచింది. చనిపోయిన రైతులవి.. రైతు ఆత్మహత్యల కింద ఒప్పుకుంటే ఎక్కడ వారి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందోనని భయపడ్డాయి. అందుకే.. ఏకంగా రైతుల్నే రైతులు కాదు అని తేల్చేశారు. వారి మరణాల్ని గుర్తించడం లేదని తేల్చేసింది. కానీ.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వ అందించే సాయమే అండగా మారుతుందని, వారి బిడ్డల భవిష్యత్త్ కు భరోసా గా నిలుస్తుందని గుర్తించలేకపోయింది. ప్రభుత్వ గొప్పలకు పోయి సామాన్య రైతుల బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నిస్థాయిల్లో విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో చివరాఖరుకు.. బాధిత రైతు కుటుంబాలు గుండెల నిండా దుఃఖంతో కోర్టులను ఆశ్రయించారు. అక్కడ కోర్టు చివాట్లు పెట్టడంతో అధికారులు దిగొచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం సైతం.. రైతులకు సాయం చేసేందుకు పెద్ద మనసు చేసుకోవడంతో బాధిత కుటుంబాలకు ఏళ్లు గడిచాక సాయం అందింది.
రైతు ఆత్మహత్యల్ని నిర్ధరణ ఎలా..
సాగు కష్టాలతో ఎవరైనా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాయం చేస్తుంది. బాధిత రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంటుంది. ఇందుకోసం.. ముందుకు మండల స్థాయిలో పోలీసులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ అధికారులు.. కలిసి ఓ కమిటీగా రైతు ఆత్మహత్యను నిర్థరించాల్సి ఉంటుంది. వ్యవసాయ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. అలా పంపిన కేసుల్లో ఆర్థిక సాయం అందిస్తుంటుంది. కానీ.. కొన్ని కేసుల్లో ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను గుర్తించలేదు. దాంతో.. వారంతా కోర్టును ఆశ్రయించారు.
Also Read : గద్దర్ హంతుకుడైతే.. అప్పుడెందుకు కౌగిలించుకుని తిరిగావ్..
సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు సైతం మానవత్వాన్ని, కేసుల్లోని నిజాయితీని గుర్తించింది. వారికి సాయంగా నిలవాలని ఆదేశించింది. అయినా.. ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకోలేదు. దాంతో.. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.. బాధిత రైతులంతా కలిసి. దాంతో.. హైకోర్టు సీరియస్ కాగా, వీలైనంత త్వరగా రైతు కుటుంబాలు పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో.. రాష్ట్ర విపత్తుల శాఖ స్పందించింది. 2014 నుంచి 2022 మధ్య ఆత్మహత్య చేసుకున్న 141 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇందుకోసం.. రూ.9.98 కోట్లను విడుదల చేసింది.