Rohith Reddy Drug Case: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి డ్రగ్స్ కేసు కలవరపాటుకు గురిచేస్తుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్ట్ కావడం…కాంగ్రెస్,బీజేపీ నుంచి విమర్శల దాడి పెరగడంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. డ్రగ్స్ కేసులో పట్డటుబడిన రోహిత్ రెడ్డి బూచిగా చూపుతూనే…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఇరకాటంలో పెట్టేలా అధికార పార్టీ నేతలు వ్యూహారచన చేస్తున్నారట. దాంతో అటు రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు గులాబీపార్టీ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.
తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌కి ముచ్చెమటలు పట్టించాలని ఆ పార్టీ భావించిన సమయంలోనే ఉహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. మొయినాబాద్‌లోని ఆయన సొంత ఫాంహౌజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా …ఈగల్ టీమ్ రైడ్ చేసింది. డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం రావడంతో ఈగల్ టీం దాడులు నిర్వహించగా.. రోహిత్ రెడ్డితో పాటు మరో 11 మంది పట్టుబడ్డారు. వారికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. పలువురు కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏపీలోని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేశ్ కుమార్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చిన ఏలూరు ఎంపీ పుట్టాకు టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఇటు రోహిత్ రెడ్డి విషయంలో కూడా గులాబీ బాస్ కేసీఆర్ సిరియస్‌గా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందంట. పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్‌ను ఆదేశించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయంపై విస్తృతంగా ప్రచారం చేశారు. డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు నడిచాయి. తాజాగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఇంతకాలం తమ పార్టీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం అని చెబుతూ వస్తున్న బీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇంతకాలం ఆరోపణలకే పరిమిత కావడంతో…విమర్శలకు సమాధానం చేప్పుకుంటూ వస్తున్న బీఆర్ఎస్‌కు… తమ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం మింగడుడడం లేదట. రోహిత్ రెడ్డిపై కొంత కాలంగా డ్రగ్స్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరు కేసుల్లో పేరు వినిపించింది. డ్రగ్స్ కేసు విషయంలో రోహిత్ రెడ్డిని కార్నర్ చేస్తూనే కేటీఆర్‌ను ఇరికాటంలో పెట్టేలా అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేరుగా కేటీఆర్‌కు సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల లోపు కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్‌కి ఒక ఎజెండా లేదు, ప్రభుత్వాన్ని తిట్టడమే ఎజెండా.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా ఎందుకు సస్పెండ్ చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తుతున్నారు. కేటీఆర్ సంబంధించిన వ్యవహారం లో ఫామ్ హౌస్‌లో జరిగిన మీటింగ్లో భాగంగా ఇదంతా జరిగిందంటున్నారని, దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరుని డీఆర్ఎస్ .. అంటే డ్రగ్స్ రాష్ట్ర సమతిగా మార్చుకోవాలని యద్దేవా చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడైనా డ్రగ్ టెస్ట్‌కు సిద్దమని. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ టెస్టులు చేయించుకుని, అందరకీ ఆదర్శంగా నిలుద్దామని ఎదురు దాడికి దిగుతున్నారు.ఆధారం లేకుండా తన పేరును డ్రగ్స్ కేసుల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. మొత్తానికి ప్రస్తుతం జైలులో ఉన్న రోహిత్ రెడ్డి భవిష్యత్తు .. ఓ వైపు రాజకీయ విమర్శలు…మరో వైపు కేసులతో అటుఇటు కాకుండా తయారైందంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రోహిత్ రెడ్డి ఎలాంటి రిప్లై ఇస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Story By Big Apparao, Big Tv