Samagra Kutumba Survey: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి తదితర అంశాల కోసం ఈ సర్వేను చేపడుతున్నారు. సర్వే ఆధారంగానే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించి 12 రోజులు అవుతుండగా ఆదివారం నాటికి 58.3 శాతం పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Also read: కోడలి వివాహేతర బంధానికి అడ్డుపడిన అత్త.. తుపాకీ నోట్లో పెట్టి కాల్చేసిన ప్రియుడు
సర్వేలో భాగంగా అధికారులు నవంబర్ 6 నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని ఇండ్ల సంఖ్యను లెక్కించారు. ఈ సందర్భంగా 1,16,14,349 ఇండ్లను గుర్తించారు. అనంతరం 9వ తేదీ నుండి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 67,72, 256 ఇండ్ల సర్వేను పూర్తి చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 8,787 మంది ఎన్యూమరేటర్లు సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో 47,561 మంది, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా 858 మంది పర్యవేక్షకులు సర్వేను పరిశీలిస్తున్నారు. జిల్లాల వారిగా సర్వేలో ములుగు జిల్లా 87.1 శాతం పూర్తి చేసుకొని ముందంజలో ఉంది. ఆ తర్వాత 81.4 శాతం పూర్తిచేసుకుని నల్గొండ రెండవ స్థానంలో ఉంది. తర్వాత వరుసగా జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో కేవలం 38.3 శాతం సర్వే మాత్రమే పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన సిటీలో సర్వే నెమ్మదిగా సాగుతున్నట్టు తెలిపారు.