Sugarcane Farmers: చెరుకు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సంగీత అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ముబీన్ తెలిపారు. ఈ సమావేశానికి చెరుకు రైతులతో పాటు షుగర్ కేన్ అధికారులు, వివిధ చక్కెర పరిశ్రమల ప్రతినిధులు హాజరుకానున్నారు.
చెరుకు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన సాగు ఖర్చులు, రవాణా, హార్వెస్టింగ్ సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించకు రానున్నాయి.ప్రస్తుతం సాగు పెట్టుబడులు విపరీతంగా పెరగడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు తగ్గడంతో చెరుకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రవాణా, హార్వెస్టింగ్ ఖర్చులు మినహాయించి చెరుకు టన్నుకు కనీసం రూ.4 వేల ధర చెల్లించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర లభిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని, లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది పొడవునా కష్టపడి పండించిన చెరుకుకు గిట్టుబాటు ధర లభించకపోతే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం రైతుల ఇబ్బందులను సానుకూలంగా పరిగణనలోకి తీసుకొని, చక్కెర పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.కేవలం సమావేశానికే పరిమితం కాకుండా రైతుల డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, టన్నుకు రూ.4 వేల ధర సాధించేలా అధికారులు చొరవ చూపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10న జరిగే చర్చలు ఫలించి చెరుకు రైతుల జీవితాల్లో నిజమైన తీపిని నింపుతాయా? అన్నది వేచి చూడాలి.
Also read: అంబానీకి అసలు బుర్రలేదు…తోపులను వదిలేసి, దద్దమ్మలను తెచ్చుకుంటున్నాడు!