SFI Protest: స్వేచ్ఛ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బాసర ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంకేతమని, అలాంటి ఉద్యమాలను అణచివేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజినీకాంత్, నాగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ, కనీస సదుపాయాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇంజినీరింగ్ అకడమిక్ ఇయర్ ముగియబోతున్నప్పటికీ విద్యార్థులకు ఇప్పటికీ ల్యాప్‌టాప్‌లు అందించకపోవడం ఘోర నిర్లక్ష్యమని మండిపడ్డారు. ల్యాప్‌టాప్‌లు లేకుండా సాంకేతిక విద్య ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శివశక్తి మెస్ కాంట్రాక్ట్ కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందుతోందని, వెంటనే ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే విద్యార్థిని తేజస్విని మరణించిందని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఆరోపించింది. 10 వేల మందికి పైగా విద్యార్థులు ఉన్న క్యాంపస్‌లో కేవలం కొద్దిమంది వైద్య సిబ్బంది మాత్రమే ఉండటం అత్యంత దారుణమని పేర్కొంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలను చేపడతామని ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.
Also Read: Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!
పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని, ముఖ్యంగా విద్యార్థులను శోభనం పెళ్లికొడుకుతో పోల్చడమనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజినీకాంత్, నాగరాజు విమర్శించారు. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి, డ్రాపౌట్ తగ్గించడానికి, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయని వారు తెలిపారు.
స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందేనని గుర్తుచేశారు. అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని, బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుందని ఎద్దేవాచేశారు. దేశంలో సుమారు 84 శాతం మంది తల్లులు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో, విద్యార్థులకు అందించే గుడ్డును గాడిద గుడ్డుగా వ్యాఖ్యానించడం ఆకలిని, పేదరికాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, దానిని బిచ్చంగా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రూ.లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి, పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు.
Also Read: No Battery Smartwatch: బ్యాటరీ లేకుండా నడిచే స్మార్ట్‌వాచ్.. ఎలా పని చేస్తుందంటే