
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని సోమవారం ఉదయం 11.50 గంటలకు ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్ కు మెయిల్ చేశాడు. ఆ బాంబు రాత్రి 7 గంటలకు బ్లాస్ట్ అవుతుందని హెచ్చరించాడు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్, పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం మొత్తం తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టులో దిగిన విమానాల లగేజీల్లో సోదాలు చేశారు. ప్రయాణికులను తనిఖీ చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని భద్రతా సిబ్బంది తేల్చారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులకు మరో ఐడీతో ఇంకో మెయిల్ వచ్చింది. తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్ పెట్టాడని అజ్ఞాత వ్యక్తి వివరించాడు. తనను క్షమించాలంటూ విజ్ఞప్తి చేశాడు.ఈ మెయిల్స్ పై స్థానిక పోలీసులకు ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్లు ఫిర్యాదు చేశారు. మెయిల్ ఐడీ ఆధారంగా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ మెయిల్ బెంగాల్ నుంచి వచ్చిందని గుర్తించారు. మొయిల్ పంపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.