కోరుట్ల దీప్తి మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. అక్కను చెల్లి చందననే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసిందని తేల్చారు. దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, చున్నీతో కట్టేసినట్టు చందన ఒప్పుకుంది. చందన, ఆమె లవర్ ఉమర్, అతని తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చందన బీటెక్ చదివింది. సీనియరైన ఉమర్‌ని ప్రేమించింది. మతం వేరు కావడంతో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. ఎలాగైనా అతనితో లేచి పోవాలని డిసైడ్ అయింది చందన. పేరెంట్స్ ఇంట్లోలేని సమయంలో ఎగిరిపోదాం రమ్మంటూ లవర్ ఉమర్‌ను కాల్ చేసి కోరుట్లకు పిలిపించింది చందన.
అక్కకు ఓడ్కా తిగించి.. ఆమె నిద్ర పోయాక.. ఉమర్‌ను ఇంట్లోకి పిలిచింది. బీరువాలో ఉన్న 70 తులాల బంగారం, లక్షకు పైగా నగదును తీసుకొని వెళ్లే క్రమంలో.. దీప్తి నిద్ర లేచింది. వారిని చూసి పెద్దగా అరవడంతో వారిద్దరూ ఉలిక్కిపడ్డారు. దీప్తి అరవకుండా ఉండేందుకు.. ఆమె ముఖాన్ని చున్నీతో బిగించారు. అయినా అరుస్తుండటంతో నోటికి ప్లాస్టర్లు వేశారు. ఊపిరి ఆడకపోవడంతో దీప్తి సోఫాలోనే మరణించింది. నగదు, గోల్డ్ తీసుకుని పారిపోతూ.. వెళ్లే ముందు దీప్తి నోరు, ముక్కుకు వేసిన ప్లాస్టర్లు తీసేసి వెళ్లిపోయారు చందన, ఉమర్.
చందన, ఆమె లవర్ ముందుగా హైదరాబాద్‌లోని ఉమర్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి నాగ్‌పూర్ పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించారు. పోలీసుల గాలింపు పెరగడంతో.. రెండురోజులుగా కారులో వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు. అయినా, పోలీసులు టెక్నికల్ యాంగిల్‌లో వారి ఆచూకీ కనుగొని.. అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు.. అక్కను చంపి, బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయి, తనకేం తెలీదన్నట్టు తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది చందన. అక్క హాఫ్ బాటిల్ మద్యం తాగిందని.. బాయ్‌ఫ్రెండ్‌ను పిలుద్దామని అనిందని.. అక్క పడుకున్నాక తాను ఇంట్లో నుంచి వచ్చేశానని.. కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే, ఇలాంటి కేసుల దర్యాప్తులో ఆరితేరిన తెలంగాణ పోలీసులు.. చందననే చంపేసి ఉంటుందని ముందునుంచే అనుమానించారు. పేరెంట్స్ సైతం చందన మీదనే డౌట్ పడ్డారు. సెల్ సిగ్నల్ ట్రేస్ చేసి.. ఒంగోలులో పట్టుకుని.. విచారణలో గుట్టు రట్టు చేశారు పోలీసు.
అయితే, చందన లవ్ ఎఫైర్ గురించి అక్క దీప్తితో పాటు తల్లికి కూడా తెలుసంటున్నారు పోలీసులు. మూడేళ్లుగా ఆ లవ్ మేటర్ నడుస్తోందని చెప్పారు. డబ్బు, గోల్డ్‌తో ఇంట్లో నుంచి పారిపోదాం అని మాత్రమే అనుకున్నారని.. దీప్తి వారిని చూసి అరవడంతో.. నోరు మూయించే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. చందనకు తన అక్క దీప్తిని చంపే ఉద్దేశం లేదని.. ఇది ముందస్తుగా ప్లాన్ చేసిన మర్డర్ కాదని క్లారిటీ ఇచ్చారు కాప్స్.