Big Stories

TSPSC : హైకోర్టుకు సిట్‌ నివేదిక సమర్పణ.. రంగంలోకి దిగిన ఈడీ..

TSPSC Paper Leak Case News : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పేప‌ర్ల లీకేజీ కేసులో సిట్ నివేదిక‌ను హైకోర్టుకు సీల్డ్ క‌వ‌ర్లో సమర్పించింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ ధన్కా వాదనలు వినిపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న సిట్‌పై నమ్మకం లేదని వివేక్ ధన్కా అన్నారు. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు చిన్న ఉద్యోగులకే పరిమితం అవుతోందన్నారు. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నట్లు ఈడీ చెబుతున్నందున.. ఈ కేసులో సిట్ దర్యాప్తు సరిపోదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేక్ ధన్కా వాదించారు.

- Advertisement -

మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఏజీ.. న్యూజిలాండ్‌లో ఉన్న మరో నిందితుడి అరెస్టుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

- Advertisement -

మరోవైపు ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వ‌ర‌కు విచార‌ణ జ‌రిపిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ కు లేఖ రాసింది. TSPSCకి సంబంధించి 8 అంశాల డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని ఈడి కోరింది. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం, ఇంటిలిజెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ సింగ్ పేరుతో నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. PMLA సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్స్ ఈడీ రికార్డ్ చేయనుంది.

చంచల్ గూడ‌ జైలులో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌ను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని కోర్టుకు ఈడీ తెలిపింది. పేపర్ లీకేజ్‌లో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అభియోగం న‌మోదు చేసింది. సెక్షన్ 48, 49 కింద ఈడీకి విచారించే అర్హత ఉందని భావిస్తోంది. జైలులో విచారణ సందర్భంగా ల్యాప్ టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖ‌లు చేసింది. జైలులో విచారణ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని చంచ‌ల్‌గూడ‌ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News