Drugs Case: హైదరాబాద్‌లోని బోయినపల్లి, సూరారం పరిసరాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా గుట్టురట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నలుగురు డ్రగ్ పెడ్లర్లతో పాటు, ఐదుగురు వినియోగదారులను కలిపి మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 12.20 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 45 గ్రాముల MDMA పౌడర్, 6 గ్రాముల క్రిస్టల్ వైట్ MDMA, 13 గ్రాముల ఎండు గంజాయి సహా రెండు కార్లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, డిజిటల్ వెయిటింగ్ మెషిన్లను పోలీసులు సీజ్ చేశారు.
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా బేగంపేటలోని క్యూ-కనెక్ట్ అనే సంస్థలో పనిచేస్తున్న అక్రమ్ రంజీత్ కుమార్ వ్యవహరించాడు. తన జీతం రోజువారీ ఖర్చులకు సరిపోకపోవడంతో, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. బెంగళూరుకు చెందిన అశ్విన్ అనే వ్యక్తితో సంప్రదింపులు జరిపి, భారీ మొత్తంలో మత్తు పదార్థాలను నగరానికి తీసుకువచ్చి విక్రయించాలని పథకం రచించాడు.
ఈ అక్రమ దందాకు పెట్టుబడి కోసం రంజీత్ తన స్నేహితులైన నితీష్ కుమార్ యాదవ్ (నాష్), వుప్పరి నవీన్ కుమార్ (టిల్లు)లను ఆశ్రయించాడు. వారి నుంచి సేకరించిన 48,000 రూపాయలను బెంగళూరులోని సరఫరాదారు అశ్విన్‌కు బదిలీ చేశాడు. అనంతరం నితీష్ కుమార్‌ను బెంగళూరుకు పంపి, అక్కడి నుంచి మత్తు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా బోయినపల్లిలోని తన నివాసానికి చేరవేశాడు.
పక్కా ప్లాన్‌తో ఈ నెల 26న రంజీత్ కుమార్, నవీన్ కుమార్ కలిసి రెండు వాహనాల్లో సూరారంలోని గాయత్రి రెసిడెన్సీ వద్దకు చేరుకున్నారు. తమ వద్ద డ్రగ్స్ ఉన్నాయని వినియోగదారులకు సమాచారం అందించడంతో, రాత్రి ఏడు గంటల సమయంలో కొనుగోలుదారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో ఆపరేషన్ ప్రారంభమైంది.
Also Read: మాదాపూర్‌లో కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొట్టి.. స్పాట్‌లోనే..
చివరికి, రాత్రి 9 గంటల ప్రాంతంలో సూరారం పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడుల్లో నిందితులందరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.