Complaint Against Etela: మేడ్చల్ జిల్లా పోచారంలో భూకబ్జా వ్యవహారంలో ఏం జరుగుతోంది? రియల్టర్‌పై ఎంపీ దాడి చేసిన ఘటన వెనుక ఏం జరిగింది? శ్రీ హర్ష నిర్మాణ సంస్థ ఎండీ వెంకటేష్ ఏమంటున్నారు? లీగల్‌గా వెళ్తామని ఆయనెందుకన్నారు? పూర్తి వివరాలు తెలీకుండా ఎంపీ ఎలా దాడి చేస్తారు? ఎంపీకి కష్టాలు తప్పవా?
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాల్టీ పరిధిలో ఏక శిలానగర్‌లో కొందరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో ఎంపీ ఈటెల రాజేందర్ కేసు నమోదయ్యింది. డ్యూటీలో ఉండగా ఈటెలతో పాటు 30 మంది తమపై దాడి చేశారంటూ సెక్యూరిటీ గార్డు ఉపేందర్ ఫిర్యాదు చేశాడు. వివరాలు పరిశీలించిన తర్వాత ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.
భూముల వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు శ్రీ హర్ష నిర్మాణ సంస్థ ఎండీ వెంకటేష్. భూముల వివరాలు తెలీకుండా ఎంపీ ఈటెల ఎలా వచ్చారు? తమపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ పార్టీలు, నాయకులతో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. ఈ వ్యవహారంలో ఈటెలపై లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు.
ఆయా భూములపై శ్రీ హర్ష నిర్మాణ సంస్థ ఎండీ వెంకటేష్ వెర్షన్ ఒక్కసారి విందాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ కొర్రెముల గ్రామ పరిధిలోని ఏక శిలానగర్‌లో 149 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 739 నుండి 749 వరకున్న భూమి ఉంది. అందులో 739 నుండి 742 వరకున్న భూముల్లో 47 ఎకరాలు తాము ల్యాండ్ ఓనర్స్ వద్ద కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించి సేల్ డీడ్, డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు.
ALSO READ: కిడ్నీ దందాలో కీలక మలుపు.. హాస్పిటల్ చైర్మన్ అరెస్ట్
సర్వే నంబర్ 743 నుండి 748 వరకు వెంచర్ వేసిన ముగ్గురు వ్యక్తులు (హనుమంతరావు, ప్రభాకర్‌రెడ్డి, సుందరంమూర్తి) ఇతర సర్వే నంబర్లో అక్రమంగా ప్లాట్స్ చేసి అమ్మకాలు చేశారని గుర్తు చేశారు వెంకటేష్. ఈ క్రమంలో ఈ వివాదం మొదలైందన్నారు. ఆయా భూములను కొనుగోలు చేసిన బాధితులను తాము మోసం చేయలేదని, అంతా త్రిమూర్తులు చేశారన్నారు.
చివరకు తమను బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు వెంకటేష్. గతంలో ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్లిందన్నారు. వారి లే అవుట్లు రద్దు చేశారని, దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు తమ దగ్గరున్నాయని వెల్లడించారు.
ఆయా భూములపై ఎలాంటి అవగాహన లేకుండా ఎంపీ ఈటెల రాజేందర్ మా పై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈటెలను వెంచర్ నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈటెలపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, లీగల్‌గా కూడా ముందుకు వెళ్తామన్నారు శ్రీ హర్ష నిర్మాణ సంస్థ ఎండీ వెంకటేష్.