BJP New Plan: సంస్థాగతంగా మహిళలకు ప్రాధాన్యతనిచ్చి పదవులు అప్పజెప్పేందుకు బీజేపీ సిద్దమవుతోందా..? సంస్థాగతంగా 33 శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తుందా..? పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించిందా? పార్టీ పదవుల పరంగా కమలం పార్టీ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుందా..? సామాజిక సమీకరణలపై కాషాయ పార్టీ వ్యూహ రచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి..?
తెలంగాణలో బలాన్ని పెంచుకోవడంపై కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి, మండల స్థాయి కమిటీల నియామకం దాదాపు పూర్తయింది. ఇక ప్రస్తుతం జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి అధ్యక్షుల నియామకంపై పార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ కూడా కొనసాగుతుందని సమాచారం.
ఒకవైపు యువ నేతలకు పెద్ద పీట వేస్తూనే, మరోవైపు మహిళలకు కూడా అదే స్థాయిలో పదవులు అప్పజెప్పాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో జిల్లాల అధ్యక్షులుగా కనీసం 10 మంది మహిళలకు పదవులు కట్టబెట్టాలని కాషాయ పార్టీ భావిస్తోంది. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీలో మహిళలకు ప్రాధాన్యతతో పాటు వారి రాజకీయ ఎదుగుదలకు కృషిచేయాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వ సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా విభజించుకొంది. ఆ లెక్కల ప్రకారం కనీసం 10 నుంచి 14 జిల్లాలకు తగ్గకుండా జిల్లా అధ్యక్ష పీఠాల్ని మహిళలకు కట్టబెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రతి జిల్లా సెగ్మెంట్ పరిధిలో మహిళలకు కనీసం రెండు మండలాల ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది. అలాగే ఆయా ప్రాంతాలవారీగా, అక్కడి సామాజిక సమీకరణాల ఆధారంగా బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. జిల్లాల అధ్యక్ష పదవులతో పాటు మండలాలు, బూత్ స్థాయిలోనూ మహిళలకు ప్రాధాన్యతను పెంచే విధంగా పాచికలు కదుపుతోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కమల దళం తమ దళాలను పెంచుకునేందుకు వ్యూహరచనలను చేపడుతోంది.
Also Read: బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు? ముగ్గురికి చేరిన సంఖ్య.. తెర వెనుక
కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను అమలుచేయాలని చూస్తోంది. దానికి సంబంధించిన బిల్లు ఇప్పటికే పార్లమెంట్ లో పాసైంది. అంతేకాదు త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపై కమలనాథులు ఇప్పటి నుంచే కసరత్తును ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహించేందుకు పరివారుల పార్టీ సిద్దమైందని పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
అందుకే బూత్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యత కల్పించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే కనీసం 10 జిల్లాలకు తగ్గకుండా మహిళలకు అధ్యక్ష పదవిని అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. ఒక వైపు యువ నేతలు, మరో వైపు మహిళలు, ఇంకోవైపు సామాజిక సమీకరణలతో అందరికీ సమానంగా పదవులు అప్పజెప్పి పక్కా ప్రణాళికలతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవుతామని చెబుతున్న కాషాయ పార్టీ వ్యూహరచన ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.