సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో పేషెంట్ల దగ్గర ఒక్క ఆపరేషన్‌కు 55లక్షల డీల్ కుదుర్చుకున్నారు డాక్టర్లు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని అలకనంద హాస్పిటల్ యాజమాన్యం కిడ్నీ రాకెట్ దందా నడుపుతోంది. డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా పేషెంట్స్ హాస్పిటల్‌కు రాగా.. పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డోనర్స్ రాజశేఖర్, బట్టు ప్రభ కిడ్నీలను.. కర్ణాటక, తమిళనాడుకు చెందిన నస్రిన్ భాను, ఫిర్దోస్ అనే ఇద్దరు మహిళలకు అమర్చారు. డబ్బుల వ్యవహారాన్నంతా ప్రదీప్ డీల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తులు డీఎంహెచ్‌ఓ గీతకు ఫోన్ చేసి అలకనంద హాస్పిటల్‌పై ఫిర్యాదు చేశారు. గీత సరూర్‌నగర్ పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందని గుర్తించారు. హాస్పిటల్‌లో తనిఖీలు చేసిన పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు హాస్పిటల్‌ను సీజ్ చేశారు.
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేసుపై ఆరా తీశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని డాక్టర్లను హెచ్చరించారు.ఈ కేసులో ఇన్వాల్వ్ అయివారందరినీ చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Also Read: హైదరాబాద్‌లో డాక్టర్ల అరాచకం.. ఏకంగా మనిషి కిడ్నీలనే..?
అలకనంద ఆస్పత్రి వద్ద AIYF నేతలు ఆందోళనకు దిగారు. అమాయకపు ప్రజలకు డబ్బు ఆశ చూపి.. మోసాలకు పాల్పడ్డ ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలకనంద ఆస్పత్రి కిడ్ని రాకెట్ ఇష్యూపై ప్రభుత్వ సీరియస్ అయింది. నిజానిజాలు బయటపెట్టేందుకు కమిటీని నియమించింది. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలకనంద ఆస్పత్రిని పరిశీలించిన కమిటీ.. గాంధీ ఆస్పత్రికి బయలుదేరారు.