Sridhar Babu: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు తన వద్ద ఉందని, అలాగే తన ప్రోగ్రెస్ రిపోర్టు కూడ సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జనవరి ఒకటవ తేదీన తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అదే తరహాలో మీడియాలో సైతం పలు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసిన ఎమ్మెల్యేలకు త్వరలోనే ప్రోగ్రెస్ రిపోర్టులు అందజేస్తానని ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించినట్లు కూడా ప్రచారం సాగింది. ప్రధానంగా ఎమ్మేల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ లకు సంబంధించి సీఎం చేసినట్లుగా కామెంట్స్ బయటకు రావడంతో పొలిటికల్ టాక్ కు దారితీసింది.
Also Read: BRS Party: జనంలోకి కేసీఆర్.. వెనకడుగు పడినట్లే?
దీనిపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పని మాటలు కూడా చెప్పినట్లుగా ప్రచారం జరిగిందన్నారు. ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా తాను కూడా ముఖ్యమంత్రి పక్కనే ఉన్నట్లు, ఇటువంటి చర్చలు ఏమి అక్కడ జరగలేదని మంత్రి తెలిపారు. జనవరి ఒకటవ తేదీన రాజకీయ చర్చలకు తావు లేకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం వరకే కార్యక్రమం సాగిందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిందని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇవ్వడంతో, సీఎం చేసినట్లుగా భావిస్తున్న కామెంట్స్ చర్చలకు తెరపడింది.