Stop the tour plan to vijayawada-Hyderabad.. warned due to the Heavy Rains effect in two telugu states: తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక చోట్ల వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు రాకపోకలు స్తంభించిపోయాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాలలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు చేరుకోవడానికి దాదాపు రాకపోకలన్నీ కట్ అయ్యాయి. జాతీయ రహదారులన్నీ ఏరులను తలపిస్తున్నాయి.భారీ వర్షాలతో నల్గొండ జిల్లా రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతికి కోదాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరకుంది. కోదాడలో ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లు చేరి ఇళ్లలోకి సైతం వరద నీరు చేరుకోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. దీనితో విజయవాడకు వెళ్లే ప్రధాన రహదాది కోదాడ కావడంతో రెండు వైపులనుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు.
తెగిపోయిన పాలేరు బ్రిడ్జి
పాలేరు బ్రిడ్జి తెగిపోయి సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. దీనితో ఆంధ్రా సరిహద్దులు, తెలంగాణ సరిహద్దులకు లింక్ తెగిపోయినట్లలయింది. నిత్యం వేలాది గా ప్రయాణిస్తుంటారు ఈ మార్గంలో. ఆంధ్రా ప్రాంతాలకు చేరుకోవాలంటే నల్గొండ, సూర్యాపేట, కోదాడ లే మార్గం. ఇప్పుడ ఆ మార్గాలన్నీ జలదిగ్భంధంలో చిక్కకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలోని బస్సులను, పలు రైళ్లను రద్దు చేశారు. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవారు తమ పనులను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచే భారీ వర్షం నమోదవుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా వర్సాలు కొనసాగుతున్నాయి. దీనితో మహబూబాబాద్, ములుగు జిల్లాలలో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో ఖాజీపేట రైలు పట్టాలు కొంతమేరకు ధ్వంసం అయ్యాయి.
కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
ఖాజీపేట స్టేషన్ లో రైలు పట్టాల మీద వరద నీరు ప్రవహిస్తోంది. దీనితో విజయవాడకు వెళ్లేవి..అటుగా హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లే పలు రైళ్లన్నీ రద్దు చేశారు రైల్వే అధికారులు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల పరిధిలోని ఇంటికన్నె వద్ద వాగు ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఎటు వెళదామన్నా ఆంధ్రాకు ఉన్న సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోవడంతో అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరూ రిస్క్ చేసి ప్రయాణాలు చేయవద్దని..మరో రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లోనూ రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు. అటు విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాలలో బుడమేరు ఉధృతికి హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం వరద నీటితో మునిగిపోయింది. ఖాజా టోల్ గెటు వద్ద అటు..ఇటు పలు వాహనాలు నిలిపివేశారు. అక్కడ కూడా సీఎం చంద్రబాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నారు. దాదాపు మూడు లక్షల మంది లోతట్టు ప్రాంత, కొండ ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి ఆహారం, తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలలో సహాయ శిబిరాలు ఏర్పాట్లు చేశారు.