Mumbai Contract Killing| తన స్నేహితుడిని హత్య చేసేందుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంట్రాక్ట్ కిల్లర్ కు డబ్బులిచ్చాడు. కానీ అత్యాశకు పోయి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మిస్సింగ్ కేసు లో ఏ సమాచారం అందకపోవడంతో ఒత్తిడిలో ఉన్న పోలీసులకు ఊరి చివర దొరికిన ఒక కారు సాయం చేసింది. దీంతో పోలీసుల చేతికి కిరాయి హంతకుల ఏజెంట్ ఒకడు చిక్కాడు. అతను చెప్పింది విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నేరుల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగస్టు 21, 2024 రాత్రి నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ మిస్సింగ్ కేసులో పోలీసులకు సరైన సమాచారం లభించలేదు. కానీ రెండు రోజుల తరువాత పోలీసులకు మంబై పూణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఒక బలేనో కారు లభించింది. ఆ కారులో కొన్ని రక్తపు మరకలున్నాయి. కారు సమీపంలో తుపాకీ నుంచి కాల్చిన బుల్లెట్ కాట్రజ్డ్ లు పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు అక్కడేదో హింసాత్మక ఘటన జరిగినట్లు అనుమానం కలిగింది.
పోలీసులు ఆ కారు ప్రయాణించిన రోడ్డు మార్గంలో సిసిటీవి వీడియోలను పరిశీలించారు. అయితే అందులో ఒక వ్యక్తిని గుర్తించి అతడిని అరెస్టు చేశారు. అతడే విఠల్ నకాడే. విఠల్.. ముంబై లో కిరాయి హంతకుల గ్యాంగ్ నడుపుతున్నాడు. ఎవరినైనా హత్య చేయాలంటే విఠల్ ను సంప్రదించి.. డబ్బులు చెల్లిస్తే చాలు. అతను కిరాయి హంతుకుల చేత హత్యలు చేయిస్తాడు. పోలీసులు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కేసులో విఠల్ నకాడే ని అరెస్టు చేసి.. తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో విఠల్ నిజమంతా చెప్పేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని నేరుల్ ప్రాంతంలో నివసించే సుమీత్ జైన్, ఆమిర్ ఖాన్ జాదా ఇద్దరు మిత్రులు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది భూములు కబ్జా చేస్తుంటారు. వీరిద్దరూ కూడా ఇలాంటి వ్యవహారాలు ఎన్నో నడిపారు. అయితే సుమీత్ కు జూదం అలవాటు.. దీంతో అతడు తన వద్ద ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. పైగా అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. దీంతో సమీత్ ఒక ప్లాన్ వేశాడు. ఊరి చివర ఒక భూమిని కబ్జా చేసి.. దాన్ని తన పేరుతో రిజిస్టర్ చేసి విక్రయించాలనుకున్నాడు.
కానీ ఈ విషయం ఆమిర్ తెలుసుకున్నాడు. వారిద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టి.. అందులో తన వాటా 50 శాతం ఉందని.. భూమి విక్రయిస్తే.. తన వాటా ఇవ్వాలని అన్నాడు. దీంతో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆమిర్ చంపాలని సుమీత్ నిర్ణియించుకున్నాడు. విఠల్ నకాడేని కలిసి ఆమిర్ ఖాన్ జాదా ని హత్య చేసేందుకు రూ.50 లక్షలు చెల్లించాడు. ప్లాన్ ప్రకారం.. సుమీత్ తన స్నేహితుడు ఆమిర్ తో కలిసి కబ్జా చేసిన భూమి వద్దకు వెళ్లారు. అక్కడ కిరాయి హంతకులు ఆమిర్ ని తుపాకీ తో కాల్చి చంపారు. ఘటనా స్థలంలో విఠల్ కూడా ఉన్నాడు.
అయితే సుమీత్ సినిమాలు చూసి అతితెలివిగా హంతకుడి తుపాకీ తీసుకొని తన కాలికి స్వయంగా కాల్చుకున్నాడు. ఆ తరువాత ఆమిర్ శవాన్ని దూరంగా ఒక నిర్మానుష ప్రాంతంలో పాతిపెట్టారు. ఈ సమయంలో సుమీత్ కాలికి బుల్లెట్ గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో సుమీత్ తనను వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లాని హంతకులకు చెప్పాడు. కానీ ఆ హంతకులు తాము ఆస్పత్రికి రావాలంటే ప్రమాదమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ విఠల్ నకాడే మాత్రం సుమీత్ ని అతని ఇంటి వద్ద తీసుకొని వెళ్లేందుకు కారులో బయలు దేరాడు. కానీ మార్గ మధ్యలో సుమీత్ బుల్లెట్ గాయం వల్ల ఎక్కువ రక్తం పోవడంతో చనిపోయాడు. ఇది చూసిన విఠల్.. తిరిగి ఆమిర్ ని పాతి పెట్టిన ప్రాంతానికి సుమీత్ శవాన్ని తీసుకెళ్లి పాతిపెట్టాడు.
Also Read: కుక్కతో దాడి చేయించి హత్య.. బాయ్ ఫ్రెండ్ కూతురిని చంపిన సైకో లేడి!
అలా ఒకరిని హత్య చేయడానికి ప్రయత్నించిన సుమీత్.. తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. పోలీసులు ఇద్దరు స్నేహితుల శవాలను ఆధీనంలోకి తీసుకున్నారు. కిరాయి హంతకుల ఏజెంట్ విఠల్ నకాడేపై ఆమిర్ ఖాన్ జాదా హత్య కేసులో సహకరించినందుకు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.