Hot Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత తగ్గడంలేదు. జూన్ రెండోవారం దాటినా వాతావరణం చల్లబడలేదు. వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో 3 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
జూన్ మొదటి వారంలోనే రావాల్సిన రుతపవనాల జాడే లేదు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. అదిగో వస్తున్నాయని అంటుండగానే.. గుజరాత్ తీరంలో బిపర్‌జోయ్ తుపాను వచ్చి.. ఇక్కడి రుతుపవనాలు ముందుకు కదలకుండా చెక్ పెట్టాయి. ఇంకేం, మాన్‌సూన్స్ లేవు.. మబ్బులు లేవు. ఆకాశం క్లియర్‌గా ఉండటంతో.. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. జూన్‌లోనూ మే తరహా ఎండలతో మాడు పగలగొడుతున్నాడు. వానాకాలంలో ఎండాకాలంతో జనాలు హడలెత్తిపోతున్నారు.
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మరో 3 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ మేరకు ఆరెంట్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కుమురం భీం, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ నిప్పుల కుంపటిగా మారింది. రాష్ట్రంలోని 478 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్రలో ఎండలు మరి దంచేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 44.8 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలో 43.9 డిగ్రీలు, అల్లూరి జిల్లాలో 42.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లాలో 42.5 డిగ్రీలు, ఏలూరు జిల్లాలో 42.2 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లాలో 41.9 డిగ్రీలు, విశాఖపట్నం జిల్లాలో 41.3 డిగ్రీలు, గుంటూరు, బాపట్ల , పల్నాడు జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలోనూ మరో 2 రోజులు కోస్తాంధ్రలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్ వరకు విస్తరించాయని చెబుతున్నారు. నైరుతి పూర్తిగా కమ్మేస్తేనే.. వానలు కురిసేది.. అప్పటి వరకూ ఈ ఎండలే.. ఇలా మండుడే.