Summer: ఎండలు భగ్గుమంటున్నాయి. నడివేసవి రాకముందే దంచి కొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. మొన్నటి వరకు చలితో వణికిపోయిన జనాలు.. ఇప్పుడు ఎండలతో సతమతమవుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడే పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. నడివేసవి వచ్చే సరికి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
మార్చి మొదటి వారంలోనే పలు చోట్ల గతేడాదితో పోలిస్తే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది నాలుగో తేదీని 37.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.
ఇక రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో బయట కాలు పెట్టే అవకాశం కూడా ఉండదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం మంచిది.
మరోవైపు సమ్మర్ రావడంతో ఏసీలు, కూలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎండలు, ఉక్కపోత బారినుంచి తప్పించుకోవడానికి జనాలు పెద్ద ఎత్తున ఏసీలను, కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో వాటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.