Supreme Court: మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈవారంలో ఆయన ఇండియాకు రానున్నారు. ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన రానుండడంతో ఫోన్ ట్యాపింగ్ అసలు గుట్టు వీడనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ఏడాదిన్నరగా తప్పించుకుంటున్నారు నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు. అమెరికాలో ఉండి అనేక డ్రామాలకు తెర లేపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. చివరకు రెడ్ కార్నర్ నోటీసు జారీతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు కాస్త సడలింపు ఇచ్చింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రభాకర్‌రావుకు మార్గం క్లియర్ అయ్యింది. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు పునరుద్ధరించాలని ఆదేశించింది. ఆయన వేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానంలో వాదనలు జరిగింది.
ప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆయన ఇండియా వచ్చేందుకు పాస్‌పోర్టు పునరుద్దరించాలని ఆదేశించింది.
ALSO READ: నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది
మూడు రోజుల్లో ఇండియా రావాలని ఆ తీర్పులో ప్రస్తావించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. పాస్‌పోర్టు ఇచ్చిన తర్వాత దేశానికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రస్తావించింది.
ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ లెక్కన ప్రభాకర్‌రావు ఇండియాకు రావడం దాదాపు ఖాయం. ఈ కేసు నుంచి రిలీఫ్ పొందేందుకు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఆయనకు ఎక్కడా రిలీఫ్ లభించలేదు.
ప్రభాకర్‌రావు వ్యవహారంలో భారత్ పంపిన రెడ్ కార్నర్ నోటీసుపై అమెరికా ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికి సంబంధించి అక్కడి హొం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆ పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులతో పంచుకున్నారు. ఆయన రావాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే.
దీంతో ఆయన పాస్ పోర్టు పునరుద్దరించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూన్ 20లోపు తమ ముందు హాజరుకావాలని నాంపల్లి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగి పోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని కీలక నిందితుడిగా చేర్చారు అధికారులు. ఈయన వస్తే అప్పటి బీఆర్ఎస్ పెద్దల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కర్మ, కర్త, క్రియ ఎవరన్నది బయటపడనుంది. మొత్తానికి ప్రభాకర్‌రావు రానుండడంతో ట్యాపింగ్ కేసు ముగింపుకు రానుంది.