Telangana: తెలంగాణలో సంచలనం రేపిన అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు సీబీఐ చేతికి వెళ్లింది. గడిచిన ఐదేళ్లుగా చేస్తున్న విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడి కోరిక మేరకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. లేటెస్ట్ విచారణలో అసలు నిందితులు బయటపడతారా? అన్నది అసలు ప్రశ్న.
తెలంగాణలో అడ్వకేట్ వామనరావు-నాగమణి దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో మృతుడు తండ్రి కిషన్‌రావుకు భద్రత కల్పించాని సూచన చేసింది.
ఐదేళ్ల కిందట సరిగ్గా 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా మంథనిలో అడ్వకేట్ వామనరావు దంపతులను నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. హత్యకు ముందు అడ్వకేట్ వామనరావు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఆ కేసు దృష్టి అంతా మధుపై పడింది. ఐదేళ్లు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. దర్యాప్తు పట్ల నమ్మకం లేకపోవడంతో వామనరావు తండ్రి కిషన్‌రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో విచారణ జరగలేదని, పోలీసులు ప్రభావితమయ్యారని ఆరోపించారు.
ALSO READ: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు
ఈ నేపథ్యంలో కిషన్‌రావు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన వీడియోలు, పత్రాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఇక ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం వామనరావు మరణ వాంగ్మూలం సరైనదేనని తేలింది.
ఈ కేసును సీబీఐకి అప్పగించానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. మంగళవారం ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నవారు బయటపడతారా? అసలైన నిందితులు సీబీఐకి చిక్కుతారా? అన్నది చూడాలి.