ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టుకున్న మరో అధికారి ఏసీబీకి అడ్డంఆ దొరికిపోయాడు. పక్కాగా సేకరించిన సమాచారం..ఆధారాలతో శుక్రవారం వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు సదరు అధికారి నివాసంతోపాటు బినామీల ఇళ్లపై దాడులు చేశారు. తనిఖీలు జరుపగా 9.41కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, బంగారు నగలు బయటపడ్డాయి. ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం చూస్తే వీటి విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
గతంలో ఖమ్మం కలెక్టరేట్ లో పనిచేసిన వీ.నర్సింహారావు ప్రస్తుతం పౌరసరఫరాల శాఖలో మహబూబాబాద్ జిల్లా మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, నర్సింహారావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా కొన్నిరోజుల క్రితం ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఆయన ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని..ఆధారాలను సేకరించింది. వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు శుక్రవారం నర్సింహారావు నివాసం, ఆఫీస్ తోపాటు మొత్తం ఏడుచోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీలు చేయగా ఖమ్మం జిల్లాలోని బల్లెపల్లి, రఘునాథపాలెం, వెలుగుమట్లలో 30.72లక్షల విలువ చేసే 1,230.16చదరపు గజాల అయిదు ప్లాట్లు ఉన్నట్టుగా డాక్యుమెంట్లు దొరికాయి.
ఇళ్లు, భూములు, రైస్ మిల్లు..
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని కల్మల చెరువు గ్రామంలో 1.08ఎకరాలు, సిరికొండలో 21.3ఎకరాలు, నామవరంలతో 5.31ఎకరాల వ్యవసాయ భూములు నర్సింహారావు, అతని మామ పేరన ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ భూముల విలువ 1.17కోట్లు ఉంఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక, ఖమ్మం టౌన్ కవిరాజ్ నగర్ లో ఓ జీ ప్లస్ టూ, ఒక జీ ప్లస్ 4 భవనాలు ఉన్నట్టుగా తేలింది. వీటితోపాటు ఎల్బీనగర్ బైరాముల్ గూడలో మరో జీ ప్లస్ టూ భవనం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక, సోదాల్లో అధికారులు క్రెటా కారు, టీవీఎస్ జ్యూపిటర్ వాహనం, హోండా యాక్టీవా స్కూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 33.48లక్షల గృహోపకరణాలను గుర్తించారు. నర్సింహారావు ఇంటి నుంచి 37తులాల బంగారు నగలు, 32తులాల వెండి సామాగ్రిని సీజ్ చేశారు. 15,600 నగదును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న అన్ని ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 9.41కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. నర్సింహారావు తన బినామీ పేర ఓ రైస్ మిల్లును కూడా నడుపుతున్నట్టుగా అధికారులు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Also Read: వరదలు లేని హైదరాబాద్ సాధ్యమేనా? హైడ్రా ఏమంటోందంటే..?