Who is Telangana BJP Chief: కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన మంత్రి వర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలకు స్థానం కల్పించారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరన్నది అసలు టాపిక్. ఇక అన్నింటికంటే ముందుగా తెలంగాణ విషయానికొద్దాం.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. ఆయన చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. తాజాగా మోదీ 3.0 కేబినెట్‌లోకి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను తీసుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపైనే ఇప్పుడు నేతలంతా చర్చించుకుంటున్నారు.
సామాన్య కార్యకర్తకు సైతం పెద్ద పదవులు అందుకునే అవకాశం ఒక్క బీజేపీలో ఉందని నేతలు బహిరంగ సభలో తెగ ఊదరగొడతారు. ఆ మాదిరిగానే పార్టీలోని కార్యకర్త స్థాయి వ్యక్తికి తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తారా? లేక పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇస్తారా? ఇదే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి.
Also Read: నిజంగా రేవంత్ రెడ్డి పరపతి తగ్గిందా ?
ఇప్పటికే తెలంగాణ బీజేపీలో దాదాపు మూడు వర్గాలు ఉన్నాయన్నది అంతర్గత సమాచారం. ఈ విషయంలో నేతలు నోరుజారిన పలు సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు ఆ వర్గాలకు చెందిన వ్యక్తులకు కాకుండా కొత్త వ్యక్తికి ఇవ్వాలని ఆలోచన చేస్తోందట ఢిల్లీ బీజేపీ. ఇప్పటికే డీకె అరుణ, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమకే ఆ పదవి వస్తుందని ఆయా నేతల మద్దతు దారులు బయటకు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికల లేకపోవడంతో పార్టీని అంటిపెట్టుకున్న నేతకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మళ్లీ సీనియర్లకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందన్నది ఢిల్లీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. త్వరలోనే దీనిపై బీజేపీ నుంచి స్పష్టత రావడం ఖాయమన్నమాట.