= అన్నిరకాల కేబుల్స్ భూమి లోపలే ఉండాలి
= బెస్ట్ పాలసీలను స్టడీ చేసి రిపోర్టు ఇవ్వండి
= వేసవిలో పవర్ సప్లైకు అంతరాయం కలగొద్దు
= వేసవిలో విద్యుత్ సరఫరాపై పక్కా ప్రణాళిక
= గిరిజన ప్రాంతాల్లో ‘సోలార్’పై నివేదిక
= విద్యుత్ శాఖపై రివ్యూలో సీఎం రేవంత్ ఆదేశం
= తెలంగాణ క్లీన్-గ్రీన్ పవర్ పాలసీ విడుదల
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
హైదరాబాద్ నగరంతోపాటు ఔటర్ రింగురోడ్డు లోపలి ప్రాంతమంతా అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్‌కు మారాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యుత్‌తో పాటు అన్ని రకాల కేబుళ్లు భూగర్భంలోనే ఉండేలా అధ్యయనం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఆ శాఖపై శనివారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా అనేక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ అమలు కోసం వివిధ దేశాల్లోని ఉత్తమ పాలసీలను పరిశీలించాలని, నగరంలో ఈ వ్యవస్థను అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు.
దేశంలోనే అత్యుత్తమ ‘అండర్ గ్రౌండ్ కేబుల్ పాలసీ’ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలన్న తన ఆలోచనలను అధికారులతో సీఎం పంచుకున్నారు. కేవలం కరెంటు కేబుళ్లు మాత్రమే కాక అన్ని రకాలవీ భూగర్భంలోనే ఉండేలా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సూచించారు. ఈ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యాన్ని అరికట్టగలుగుతామని, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారించగలుగుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వేసవిలో సరఫరాపై పక్కా ప్రణాళిక
రాబోయే వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధంగా ఉండాలన్నారు. గతేడాది మార్చి నెలలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని, ఈసారి అది 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్టు ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళిక చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
వ్యవసాయానికి, గృహ అవసరాలకు మార్చి నెలలో పీక్ డిమాండ్ ఉంటుందని, దానికి అనుగుణంగా సరఫరా ఉండేలా చూడాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరిస్తున్నందున రోజురోజుకూ విద్యుత్ అవసరాలు, డిమాండ్ పెరుగుతాయని, దానికి అనుగుణంగా సరఫరా జరగాలని అధికారులను అప్రమత్తం చేశారు. సాంకేతిక సమస్యలు వచ్చిన వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి ప్రత్యమ్నాయంగా సరఫరా చేసే వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో ఇండ్లకు ‘సోలార్’
ఆదివాసీ గూడేలలోని ఇండ్లకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖతో పాటు సంబంధిత శాఖలతో సమావేశమై, వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు. పూర్తి నివేదిక ఆధారంగా ఆదివాసీ గూడేలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి, ఏ విధానంలో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిను తయారు చేయాలన్నారు.
ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని సూచించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పరిగి దగ్గర 400 కేవీ సబ్ స్టేషన్ మంజూరైనా పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నదని చెబుతూ.. పురోగతి నివేదికను అందించాలని అధికారులకు ఆదేశించారు. గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించనున్న నేపథ్యంలో స్టేడియం పక్కనే ఉన్న సబ్ స్టేషన్‌ను మరోవైపు తరలించాలని సూచించారు. మరింత అదనపు సామర్థ్యంతో పూర్తిగా అధునాతన టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
క్లీన్-గ్రీన్ విద్యుత్ పాలసీ ఆవిష్కరణ :
రాష్ట్ర ఇంధన శాఖ రూపొందించిన క్లీన్-గ్రీన్ విద్యుత్ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఎక్కువగా ఉన్నది. దీనితో వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు భవిష్యత్తులో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా పాలసీలో స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్లాంట్లను ఉత్పత్తిచేసే సంస్థలకు రాయితీలను ప్రకటించింది.
గడచిన పదేండ్లుగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో పాటు వివిధ రకాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 660 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటే 2019 నాటికి 10,818 మెగావాట్లకు, 2024లో 15,623 మెగావాట్లకు చేరిందన్నారు. మరో నాలుగేండ్లకు (2028 నాటికి) ఇది 20,968 మెగావాట్లకు పెరిగి, 2035 నాటికి 31,809 మెగావాట్లకు చేరుకుంటుందని ఈ పాలసీ అంచనా వేసింది.
2035 నాటికి 16,966 మెగావాట్ల సోలార్ పవర్
ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేవలం 7,889 మెగావాట్లుగా ఉన్నదని, 2035 నాటికి ఇది 16,966 మెగావాట్లకు పెంచాలని లక్ష్యాన్ని పాలసీ నిర్దేశించింది. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి 10,388 మెగావాట్లు మాత్రమే ఉన్నదని, పదేండ్లలో (2035 నాటికి) ఇది 47,061 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి తోడు జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్లే ఉన్నదని, దీన్ని మూడువేల మెగావాట్లకు పెంచనున్నట్లు తెలిపింది. అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి కలిపి 2035 నాటికి 66,694 మెగావాట్లకు చేరుకోనున్నట్లు అంచనా వేసింది.
సోలార్, విండ్ పవర్ ప్లాంట్లను పెట్టే కంపెనీలకు స్టాంపు డ్యూటీలో, స్టేట్ జీఎస్టీలో, వీలింగ్ చార్జీల్లో ఎలక్ట్రిసిటీ డ్యూటీలో, వాటర్ చార్జెస్‌లో 100% రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపింది. స్వయం సహాయక మహిళా బృందాలు 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చని, దీన్ని కొనుగోలు చేయడానికి డిస్కంలు ఉదార విధానాలను అవలంబిస్తాయని పేర్కొన్నది. ప్రభుత్వం రూపొందించిన ఈ పాలసీ రానున్న యాభై ఏండ్లకు ఉద్దేశించినప్పటికీ, రాయితీలు, ప్రోత్సాహకాలు పదేండ్ల వరకు వర్తిస్తాయని తెలిపింది. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిలో సృజనాత్మక ఆలోచనలను రూపొందించేందుకు రూ. 50 కోట్ల ఫండ్‌తో ఇంక్యుబేషన్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లుతెలిపింది.