తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారంట. వారి అసంతృప్తికి కారణం కొందరు కేబినెట్ మంత్రులు అనుసరిస్తున్న వైఖరే అంటున్నారు. తాజాగా భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యేల భేటీ జరిగిందంటున్నారు.
అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ.. ఎవరు ఎప్పుడైనా సమావేశాలు కావచ్చు. పార్టీలో ఎవరిమీద ఏదైనా మాట్లాడవచ్చని ఆ పార్టీ నేతలే తరచూ చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో అలాంటి సమావేశం ఒకటి జరగడం కలకలం రేపుతుంది. కేబినెట్లోని కొందరు మంత్రులు వ్యవహార తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలే ఈ మీటింగ్ పెట్టుకున్నారంట. అలాంటి వారికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారంట. తాజా మీటింగులో ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ మంత్రుల తీరు నచ్చకపోవడంతోనే ఇలా రహస్యంగా సమావేశమైనట్టు చెప్పుకుంటున్నారు.
కేబినెట్‌లో కొంతమంది మంత్రులపై పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తికి పెద్దకారణమే ఉందంట.. నియోజకవర్గాల్లో కాంట్రాక్టుల కేటాయింపుల్లో సదరు అమాత్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంట. ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినా పనులు దక్కకపోవడంపై వారు తీవ్ర అసహనంతో ఉన్నారంట.. చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా ఇప్పించుకోలేకపోతే ఎమ్మెల్యేలుగా తాము గెలిచి ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Also Read: ఇందిరమ్మ ఇండ్లపై.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
ఆ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో చిన్న చిన్న పనులకు సంబంధించిన బిల్లుల విడుదల్లోనూ విపరీతమైన జాప్యం జరుగుతుందంట. దానికి సంబంధించి మంత్రులను కలవడానికి స్వయంగా ఎమ్మెల్యేలు వెళ్లినా అపాయింట్‌మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోందంట. ఇటీవల అలా వెళ్లిన ఒక ఎమ్మెల్యే మూడు గంటలకు పైగా వెయిట్ చేస్తే కాని మంత్రి దర్శనభాగ్యం లభించలేదంట. దాంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత లేకపోతే ఎలా అని వారంతా ఫైర్ అవుతున్నారంట.
చిన్నచిన్న పనులు కూడా ఇప్పించుకోలేక నియోజకవర్గాల్లో తల ఎత్తుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదనగా అంటున్నారు. మంత్రుల పనితీరు మార్చుకోకపోతే దీర్ఘకాలంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆ క్రమంలోనే సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు, బిల్లుల విషయంలో ఏం చేద్దామని చర్చలు జరిపారంట. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం మంచిదని కొంతమంది ప్రతిపాదించడంతో.. త్వరలో మరోసారి భేటి అయ్యి చర్చిద్దామంటూ నిర్ణయించుకున్నారంట. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలర్ట్ అయ్యారంటున్నారు.