BigTV English

Union Budget Telangana : బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష.. నేడు పీసీసీ ధర్నా

Union Budget Telangana : బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష.. నేడు పీసీసీ ధర్నా

Union Budget Telangana Protests | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. బిహార్‌కు భారీగా నిధులు కేటాయించి, తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కాదు, దేశ పురోగతికే అడ్డంకిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినందుకు నిరసనగా పీసీసీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది.


తెలంగాణకు కేంద్రం మొండిచేయి
కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “తెలంగాణకు రావాల్సిన నిధులను తగ్గించేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా వ్యవహరించింది. రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గిస్తూ, కేంద్ర ప్రాయోజిత పథకాలపై (CSS) ఆధారపడే విధానాన్ని పెంచింది. ఇది ఆర్థిక సమాఖ్య ప్రాతిపదికకు విరుద్ధం.” అని అన్నారు.

బిహార్‌ వంటి రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపిందని భట్టి మండిపడ్డారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బడ్జెట్‌ విఫలమైందని, హైదరాబాద్‌లో మరో విమానాశ్రయం అభివృద్ధి చేయడంపై కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో కృత్రిమ మేధ (AI) కేంద్రాల స్థాపనపై కూడా కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని మండిపడ్డారు.


“రైతులకు, పేదలకు బడ్జెట్ వ్యతిరేకం” – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేంద్ర బడ్జెట్‌ రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉందని, ఎన్నికలున్న రాష్ట్రాలకే ప్రధానంగా నిధులు కేటాయించారని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. “తెలుగు కవి గురజాడ అప్పారావు వ్యాఖ్యలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి.. అదే తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపారు.” అని విమర్శించారు.

ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఐటీఐఆర్ ప్రాజెక్టుల కోసం దశాబ్దకాలంగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నా, బీజేపీ ప్రభుత్వం మళ్లీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. “గతేడాది బడ్జెట్‌ను మేము ‘కుర్సీ బచావో బడ్జెట్‌’ అని పిలిచాం. ఈసారి ‘చునావ్‌ జీతావ్‌ బడ్జెట్‌’ అని పిలుస్తున్నాం.” అని అన్నారు.

Also Read: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌కు గద్దర్ పేరు పెడతాం..? బండి సంజయ్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

“తెలంగాణకు మరోసారి ద్రోహం” – శ్రీధర్‌బాబు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన నిధులు కేటాయించకపోవడం అన్యాయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్రీధర్‌బాబు అన్నారు. “తెలంగాణ జీడీపీలో దేశానికి 5% వాటా కలిగి ఉన్నా.. కేంద్రం రాష్ట్రానికి అనుకున్నంత నిధులు ఇవ్వలేదు. రాష్ట్రం నుంచి రూ. 26,000 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లినా, తిరిగి రావాల్సిన నిధులు మంజూరు చేయలేదు.” అని విమర్శించారు.

తెలంగాణ నుంచి బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినా, ప్రధాని మోదీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రూ. 1.63 లక్షల కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని తెలిపారు. హైదరాబాద్ మెట్రో-2 విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ, భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టులు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం రాష్ట్రం తరఫున పెట్టిన అభ్యర్థనలన్నింటినీ కేంద్రం పూర్తిగా తిరస్కరించిందని మండిపడ్డారు.

తెలంగాణ వ్యాప్తంగా పిసీసీ నిరసనలు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినందుకు నిరసనగా పీసీసీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు ఈ నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×