Sachin Tendulkar: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, పద్మ విభూషణ్, పద్మశ్రీ, మహారాష్ట్ర భూషణ్.. ఇలా ఎన్నో పురస్కారాలు సచిన్ కీర్తి కిరీటంలో చేరాయి. అయితే ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్ ని పలు క్రీడా అవార్డులతో ఎన్నోసార్లు సత్కరించాయి.
Also Read: U19 Women’s T20 World Cup: నేడు టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్.. ఉచితంగా ఇలా చూడొచ్చు..?
ఇప్పుడు మరో గొప్ప గౌరవాన్ని అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. మాజీ వెటరన్ వికెట్ కీపర్, భారత తొలి కెప్టెన్ కల్నల్ సి.కె నాయుడు పేరు మీదుగా 1994 నుండి బీసీసీఐ “లైఫ్ టైం అచీవ్మెంట్” అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రధానం చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది బీసీసీఐ. 51 ఏళ్ల సచిన్ రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ కి వెన్నుముకగా నిలిచిన నేపథ్యంలో జీవిత సాఫల్య పురస్కారంతో సచిన్ ని సన్మానించారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన జీవితంలోని ఉద్వేగ భరితమైన సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి పాకిస్తాన్ టూర్ కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది..? తన తండ్రి మరణించడంతో తనలో ఎటువంటి మార్పులు వచ్చాయి..? తాను ఎదుర్కొన్న ఇబ్బందికర సంఘటనలు ఏంటి..? ఇలా పలు విషయాలను గుర్తుచేసుకున్నారు సచిన్ టెండూల్కర్. 1990లో రెండేళ్ల పాటు ఎటువంటి బ్యాట్ కాంట్రాక్టులు లేకుండానే క్రికెట్ ఆడినట్లు తెలిపారు. ఆ సమయంలో కంపెనీలు ఎక్కువగా మద్యపానం, ధూమపానం వంటి వాటిని ప్రమోట్ చేసేవని.. కానీ వాటికి తాను విరుద్ధమని చెప్పినట్లు తెలిపారు.
ఆ సమయంలో అది చాలా పెద్ద నిర్ణయమని పేర్కొన్నారు సచిన్. అంతేకాదు 1999లో ఆరోగ్యపరంగా తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో తన వెన్నెముకకు తీవ్రంగా గాయమైందని.. ఆ గాయం చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపారు. ఇక తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ టూర్ తనకు ఎన్నో విషయాలను నేర్పిందని చెప్పుకొచ్చారు.
” 1989లో నేను తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నా వయసు 16 ఏళ్లు. అక్కడ ప్రాక్టీస్ కోసం రోజూ మా బస్సు ఉదయం 9 గంటలకు బయల్దేరేది. కానీ ఓ రోజు కొన్ని నిమిషాల పాటు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కపిల్ దేవ్ 9 అయ్యిందా..? లేక తొమ్మిది దాటిందా..? అని ప్రశ్నించారు. ఇక అప్పటినుండి నా వాచ్ లో టైం ని పది నిమిషాలు ముందే పెట్టుకున్నాను. ఆ పాకిస్తాన్ పర్యటన నాకెంతో నేర్పింది. 1999 వరల్డ్ కప్ సమయంలో మా నాన్న చనిపోతే అంత్యక్రియల కోసం ఇంటికి వచ్చాను.
ఆ తర్వాత కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఉండి.. కొంతకాలం తర్వాత మళ్లీ టీం తో కలిశాను. ఆ సమయంలో ఒక్కరోజులోనే నా జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మా నాన్నకు చూపించాలని నిర్ణయించుకున్నాను. ఆ కారణంగానే ఏది సాధించినా ముందుగా బ్యాట్ పైకి ఎత్తి మా నాన్నకు చూపిస్తాను”. అని ఎమోషనల్ అయ్యారు సచిన్.