Beer @ Rs 100: వేసవి కాలం ముందుగానే ఎండలు విపరీతమయ్యాయి. మండే ఎండలకు అంతా కూల్ కూల్ అవ్వాల్సిందే. మజ్జిగ, నీటితో కొందరు కూల్ అవుతారు. బీరు ప్రియులు మాత్రం కూల్ కూల్ గా బీరు త్రాగనిదే ఉండలేరు. అందుకే రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త నినాదం వినిపిస్తున్నారు బీరు ప్రియులు. తమ డిమాండ్స్ నెరవేర్చడంలో ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఏకంగా ప్రజావాణిలో తమ వినతిని ఇచ్చారు. దీన్ని బట్టి చెప్పవచ్చు.. బీరు ప్రియుల కోరిక ఎంత బలంగా ఉందో..!
సాధారణంగా వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఏ కంపెనీ బీరు అయితే ఏమి, కూల్ గా ఉందా లేదా అన్నది ముఖ్యం అంటారు బీరు ప్రియులు. మండే ఎండలకు బీర్ల కొనుగోళ్ల ధాటికి, గతంలో చాలా సార్లు నో స్టాక్ బీర్స్ అంటూ వ్యాపారస్తులు బోర్డులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం సరిపడా స్టాక్ ఉండేలా ఎక్సైజ్ అధికారులను ముందస్తుగానే అప్రమత్తం చేసే పరిస్థితి. గత ఏడాది కింగ్ ఫిషర్ బీర్లు తగినంత స్టాక్ లేవని, తాగుబోతుల సంఘం అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన దెబ్బకు ఎక్సైజ్ శాఖ స్పందించి అప్పటికప్పుడు స్టాక్ తెచ్చేసింది. అదన్నమాట వారి రేంజ్. తాజాగా రానున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు బీరు ప్రియులు.
ఇటీవల తెలంగాణలో బీర్ల ధరలు కాస్త పెరిగాయి. కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ కూడా ధరలు పెంచడం లేదంటూ కొద్దిరోజులు రాష్ట్రానికి సరఫరా ఆపేసింది. చిట్టచివరకు ప్రభుత్వం జోక్యంతో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరించారు. దీనితో బీరు ప్రియులు హమ్మయ్య అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రజావాణిలో పలువురు ఓ అర్జీ సమర్పించారు. ఆ అర్జీ స్వీకరించిన అధికారులు.. అవాక్కయ్యారు. ఔను అందులో ఏముందంటే.. రానున్న వేసవి కాలపు ఎండలను దృష్టిలో ఉంచుకొని. కేవలం రూ. 100 లకే బీర్లు అందించాలన్న డిమాండ్ అది. ఎన్నికలు ఏవైనా గెలిచేది ఎవరనేది తామే నిర్ణయిస్తామని, తమ డిమాండ్ నెరవేర్చకపోతే చాలా వరకు వెళ్తామంటూ హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా డిమాండ్ నెరవేర్చాలని, లేకుంటే సంఘం పెట్టడం ఖాయమని కూడా అర్జీలో వివరించారు. అంతేకాదు ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో మెగావాటా మాదే అంటూ బీరు ప్రియులు ప్రకటించుకున్నారు.
Also Read: నేరాల విధానం మారుతోంది.. డీప్‌ఫేక్‌తో చాలా ప్రమాదమన్న సీఎం రేవంత్
అధికారులు మాత్రం అర్జీని స్వీకరించారు. ఏ నిర్ణయం తీసుకుంటారో మాత్రం తెలియరావడం లేదు. బీరు ప్రియుల డిమాండ్ నెరవేరిందా.. ఊహించని రీతిలో బీర్ల అమ్మకాలు సాగుతాయి. కానీ ధరలు తగ్గించని పక్షంలో సంఘం పెట్టి మరీ పోరాటం చేస్తామంటున్నారు. మొత్తం మీద ఈ అర్జీకి ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో వేచి చూసే ధోరణిలో బీరు ప్రియులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు మాత్రం, వారి డిమాండ్ కరెక్ట్ అంటూ మద్దతు పలుకుతున్నారు. ఎంతైనా మండే ఎండలకు ఒకటికి బదులు రెండు బీర్లు త్రాగే వారికి ధరలతో పెద్ద చిక్కు వచ్చిందని బీరు ప్రియులు తెలుపుతున్నారు. ఇంతకు వేసవి కాలం ముందుగా వీరి డిమాండ్ నెరవేరుతుందా లేదా అన్నది వెయిట్ అండ్ సీ!