Telangana ex cm kcr make Yagam at his farm house: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెంటిమెంట్ పాళ్లు ఎక్కువే. భక్తి కూడా ఎక్కువే. తాను నమ్మిన అదృష్ట సంఖ్య ఆరు నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఆయన కారుతో సహా ఏ కార్యక్రమాన్ని చేసినా తప్పకుండా దాని పక్కన ఆరు ఉండాల్సిందే. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సారు..కారు..పదహారు అని పార్లమెంట్ ఎన్నికలలో నినాదం ఇచ్చారు. అలాగే గెలిచి చూపించారు. అయితే వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి..అంతకు ముందు లిక్కర్ కేసులో కవితకు జైలు వంటి అంశాలన్నీ ఒకదానితో మరొకటి చుట్టుముట్టాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. దాదాపు 10 మందికి పైగా కాంగ్రెస్ లో చేరిపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలను జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది. క్రమశిక్షణ చర్యల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. మళ్లీ మరోసారి 6 సెంటిమెంటు తో నేడు (సెప్టెంబర్ 6) యాగం చేయ సంకల్పించారు.
అప్పట్లో రాజశ్యామల యాగం
త్వరలో స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పార్టీని పునర్నించుకోవడం ఒక్కటే ఏకైక లక్ష్యం. అసలే కార్యకర్తలు, నేతలు చాలా నైరాశ్యంతో ఉన్నారు. త్వరలోనే కుమార్తె కవితతో కలిసి తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించడానికి సన్నద్ధం అవుతున్నారు.అయితే ఇవన్నీ మొదలు పెట్టాలంటే ముందుగా దైవబలం కావాలి. అందుకోసం ఓ యాగం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ ఆరు అంటే నేడు తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక యాగం చేయ సంకల్పించారు. ఈ యాగంలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్నారు. అప్పట్లో 2015, 2018 సంవత్సరాలలో ఎర్రవెల్లి పామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా నవంబర్ నెలలో రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్? అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుంచి చేరికలపై దృష్టి సారించింది. కేసీఆర్, కేటీఆర్ పై కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలు వేగవంతం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ మానసిక ప్రశాంతత కోసం, పార్టీ పూర్వ వైభవం కోసం, తనపై కేసులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరో యాగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రజాక్షేత్రంలోకి..
రాబోయే స్థానిక ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ..మరో పక్క కవితకు జరిగిన అన్యాయంపై సానుభూతి కోరుతూ విస్తృత స్థాయి ప్రచారం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని సుడిగాలిలా పర్యటించి..క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేస్తూ..కొత్త గా పార్టీ సభ్యత్వాలను తీసుకుంటూ పార్టీకి పునర్‌వైభవం వచ్చేలా కృషి చేస్తున్నారు. కవిత కూడా తనను అన్యాయంగా జైలులో ఎలాంటి ఆధారాలు లేకుండా కుట్ర పన్ని జైలుకు పంపించారని ఒక మహిళ అని చూడకుండా అర్థరాత్రి ఇంటికి వచ్చి అరెస్టు చేశారని..ఇంతకాలం బెయిల్ కూడా రాకుండా కుట్రలు చేశారని ప్రజల ముందుకు వెళ్లి చెబుదామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇకపై జాతీయ స్థాయిలో కాదు ప్రాంతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.