ART Centres: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఎయిడ్స్ బాధితులకు మరింత చేరువగా, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఏఆర్టీ (యాంటీ రిట్రోవైరల్ థెరపీ) సెంటర్లను, మరో 13 జిల్లాలకు విస్తరించాలని సర్కార్ సంకల్పించింది.ఈ నిర్ణయంతో బాధితులకు స్థానికంగానే స్క్రీనింగ్ పరీక్షల నుంచి ఉచిత మందుల పంపిణీ వరకు అన్ని రకాల వైద్య సేవలు సులభతరం కానున్నాయి. రోగుల చెంతకే ఉచిత వైద్యం అందనున్నది.
గతంలో ఎయిడ్స్ బాధితులు మందులు,కౌన్సిలింగ్ కోసం దూర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన ఆసుపత్రులకు, పక్క జిల్లాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వారికి ఆర్థికంగా భారం కావడమే కాక, శారీరక శ్రమకు గురిచేసేది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, వైద్య సేవలను వికేంద్రీకరించాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
కొత్తగా ఏర్పాటయ్యే సెంటర్లలో అత్యాధునిక స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన ఏఆర్టీ మందులను నిరంతరాయంగా, పూర్తిగా ఉచితంగా అందిస్తారు.అంతేగాక బాధితుల్లో నైతిక బలాన్ని నింపేందుకు ప్రత్యేక కౌన్సిలర్లను కూడా నియమించనున్నారు. హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల పేర్కొంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 25.44 లక్షలు కాగా, అందులో తెలంగాణలో 1.58 లక్షల మంది ఉన్నట్లు తెలిపింది. బాధితుల సంఖ్య పరంగా తొలి ఐదు స్థానాల్లో మహారాష్ట్ర (3.90 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (3.20 లక్షలు), కర్ణాటక (2.80 లక్షలు), ఉత్తర్‌ప్రదేశ్ (1.97 లక్షలు), తమిళనాడు (1.69 లక్షలు)లు ఉన్నాయి. రాష్ట్రంలో16 నుంచి 35 ఏళ్ల లోపు వారిలో వ్యాధి ఎక్కువగా సోకుతున్నది. ఈ ఏజ్ గ్రూప్‌లోని ప్రతీ ఐదు వేల మంది రోగుల్లో 50 మంది సీరియస్ కండీషన్లోకి వెళ్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
Also Read: కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!
రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మధ్యస్థంగా వ్యాపిస్తోంది.దీంతో అన్ని జిల్లాల్లో ఏఆర్ టీ కేంద్రాలు ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 13 జిల్లాల కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు లేదా జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఈ ఏఆర్టీ సెంటర్లను అనుసంధానించనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై హెచ్ఐవీ బాధితులు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఏఆర్టీ సెంటర్ అందుబాటులోకి రావడం వల్ల బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడే అవకాశం కలుగుతుంది. దీనివల్ల సమాజంలో హెచ్ఐవీ వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు రహస్యంగా ఉంచాల్సిన బాధితుల వివరాల విషయంలో సర్కార్ పూర్తి గోప్యతను పాటిస్తూ, వారికి వివక్ష లేని వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని వైద్యాధికారులు చెప్తున్నారు.
Also Read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకునన్న సర్కార్!