Overseas Jobs: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు విదేశీ గడ్డపై ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, జర్మనీలలో ఉన్న భారీ డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా యువతను తీర్చిదిద్దనుంది. కేవలం ఉద్యోగ అవకాశాలే కాకుండా, అక్కడి జీవనశైలితో పాటు ఆ దేశాల బాషలు మాట్లాడేలా మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నట్లు సమాచారం. శిక్షణ పూర్తి కాగానే ఆయా దేశాలో ఉపాధి కల్పించబోతున్నారు. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడనుంది. ప్రభుత్వమే ఆ దేశాలకు ఉద్యోగాల నిమిత్తం పంపిస్తుండటంతో ఉద్యోగ సెక్యూరిటీ కూడా ఉంటుంది.
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ‘నీథమ్'(NITHM.. National Institute of Tourism & Hospitality Management) వేదికగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది.అయితే చాలామంది యువతకు నైపుణ్యం ఉన్నప్పటికీ, భాషా సమస్య వల్ల విదేశీ అవకాశాలను కోల్పోతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం.. జపాన్, జర్మనీ దేశాల్లోని భాషలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు నెలల పాటు సాగే ఈ కోర్సులో భాషతో పాటు ఆయా దేశాల సంస్కృతి, పని వాతావరణంపై అవగాహన కల్పిస్తారు.కేవలం వృత్తి విద్యా కోర్సులే కాకుండా, ఆయా దేశాల భాషలపై పట్టు సాధించేలా మూడు నెలల పాటు క్రాష్ కోర్సులను నిర్వహించనుంది. తెలంగాణ టూరిజంశాఖ, కార్మికశాఖల సంయుక్త ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 200 మంది యువతకు శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also read: డిగ్రీ చదివే కుర్రాడు గ్యాంగ్ లీడర్‌గా… ఓటీటీలోకి వచ్చిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండలం కవెలిలో టూరిజం మేనేజ్ మెంట్ హాస్టల్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ భవనంలో శిక్షణ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా నిరూపయోగంగా మారినట్లు సమాచారం. అయితే అందులో మళ్లీ యువతకు ఉపాధికోసం పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రస్తుతం జపాన్, జర్మనీ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో హోమ్ కేర్, హాస్పిటాలిటీ (ఆతిథ్య రంగం), కేర్ టేకర్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారి కోసం ఆయా దేశాలు ఎదురుచూస్తున్నాయి. వృద్ధుల సంరక్షణ, వైద్య సహాయం, హోటల్ మేనేజ్మెంట్, సర్వీస్ రంగం, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో సేవలు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మధ్యకాలంలో కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జపాన్ పర్యాటనకు వెళ్లగా అక్కడ ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. నిబంధనలు, కంపెనీల పనితీరుపై లోతైన అధ్యయనం చేశారు. దీంతో అందుకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతుంది.
ఒక్కో బ్యాచ్ కు 200ల మంది విత్ హాస్టల్ తో శిక్షణ ఇవ్వాలని కార్మిక, టూరిజం శాఖలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. “యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడమే మా లక్ష్యంగా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాయి. శిక్షణ పూర్తి అయిన తర్వాత అక్కడి కంపెనీలతో అధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఆ వెంటనే శిక్షణ పొందిన అభ్యర్థులను ఆయా దేశాలకు ఉద్యోగాల నిమిత్తం పంపించనున్నట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, కార్మిక శాఖ మరియు టూరిజం శాఖల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ శిక్షణ నిర్వహించబోతున్నట్లు సమాచారం. సరైన నైపుణ్యం ఉండి, విదేశాల్లో స్థిరపడాలనుకునే యువతకు ఇదొక సువర్ణావకాశం కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: జస్ట్ 10 నిమిషాల్లో.. నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోండిలా!