Telangana Govt: తెలంగాణ ఎంపీలకు ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఇవ్వనున్నది. ఈ టాస్క్ ను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్ధతు కూడా అవసరం అంటూ సర్కార్ సూచించింది. కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై పోరాటానికి ఎంపీలతో ప్రత్యేక కమిటీని వేయాలని భావిస్తున్న ది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పై వివక్ష చూపుతున్నారంటూ కేంద్రంపై ఈ కమిటీ ఒత్తిడి పెట్టనున్నది.
తెలంగాణకు తీవ్ర అన్యాయం
కేంద్ర బడ్జెట్ 2026-27 కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కమిటీ గళమెత్తనున్నది. విభజన హామీల నుంచి మొదలుకొని, ఆధునిక టెక్నాలజీ ప్రాజెక్టుల వరకు కేంద్రం ‘మొండిచేయి’ చూపిందని ఆరోపిస్తూ, దీనిపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల ఎంపీలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడం గమనార్హం. ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు తీసుకొని ఈ కమిటీ నిధులు, పెండింగ్ హామీలపై ప్రశ్నించనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా వినతి పత్రాలు తయారు చేయనున్నారు.
Also Read: Budget 2026: బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏముంది?.. విలేకరి ప్రశ్నకు నిర్మలమ్మ రియాక్షన్ వైరల్
కేంద్రంపై ఒత్తిడికి ‘స్పెషల్ టాస్క్ గ్రామ స్థాయిలో నిరసనలు
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా,రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీల కు అతీతంగా పోరాడినట్లే, ఇప్పుడు కూడా తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న 47 కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రికి సమగ్ర నివేదికలు సమర్పించడం వంటి కార్యక్రమాల్లో ఎంపీలంతా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నదని సర్కార్ చెప్తున్నది. ఇక కేంద్రం చేస్తున్న వివక్షను కేవలం ఢిల్లీ స్థాయిలోనే కాకుండా, గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సర్కార్ నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలు (డీసీసీలు) ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు పార్లమెంట్ వేదికగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళమెత్తాలని, ప్రత్యేక ప్యాకేజీల కోసం పట్టుబట్టాలని సీఎం నుంచి ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
రాష్ట్ర ఆశలపై నీళ్లు….కేంద్రం వివక్ష
వాస్తవానికి సెమీ కండక్టర్ సిటీ కింద కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా మౌలిక వసతులు, నిధులు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో పాటు రీజినల్ రింగ్ రోడ్ భూ సేకరణకు నిధులు, జాతీయ రహదారి హోదా, వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు , మురుగి నీటి శుద్ధికి మాస్టర్ ప్లాన్, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, మెట్రో రైల్ ఫేజ్ 2 కు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నది. కానీ వాటిపై కేంద్రం నీళ్లు జల్లుతూ బడ్జెట్ కేటాయించడం దారుణమంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మండిపడ్డారు. ఇక హైదరాబాద్‌ను గ్లోబల్ ఆర్ అండ్ డీ హబ్‌గా మార్చే ప్రయత్నాలకు కేంద్రం నుంచి ఎటువంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందలేదు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఎనర్జీ పార్కుల ఏర్పాటుకు భూములు సిద్ధంగా ఉన్నా, నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపుతోంది.
మెగా పార్కులకు కేంద్రం మద్దతు
తెలంగాణ పత్తి, పాడి పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ, వాటికి వాల్యూ ఎడిషన్ కల్పించే మెగా పార్కులకు కేంద్రం మద్దతు ఇవ్వడం లేదు.అంతేగాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించి సబ్‌ప్లాన్ నిధులలో కోత విధించడం, రాజ్యాంగబద్ధంగా అందాల్సిన హక్కుల విషయంలో కేంద్రం నిర్లిప్తత ప్రదర్శిస్తోందని ప్రభుత్వం వాదిస్తోంది.ఎనర్జీ పార్కులు మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లు, డ్రై పోర్టులు, డెయిరీ, ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, హరిత విద్యుత్ వంటి అంశాల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం చెప్తున్నది. అయితే ఒకవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేస్తూ, దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణను విస్మరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
Also Read: Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం