Student Bicycles: స్వేచ్ఛ బ్యూరో: విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. విద్యార్థులు స్కూల్ లకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కొంతమంది స్నేహితులు, అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సైకిళ్ల పంపిణీ శ్రీకారం చుట్టాం.విద్యార్థులను చదువుకు ప్రోత్సహించేందుకు ఇచ్చే చిన్న బహుమతి ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కవిద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఎర్రుపాలెం మండలం కేంద్రంలోని టి.జి.ఎస్.డబ్ల్యు. రెసిడెన్షియల్ స్కూల్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఎర్రుపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ ప్రారంభించామని, కొనసాగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తెలిపారు. ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదివే విధంగా డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం, క్రీడా మైదానాలు, ల్యాబ్, లైబ్రరీ వంటి సదుపాయాలతో ఈ పాఠశాలలు రూపొందుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 పాఠశాలల పనులు ప్రారంభమైనట్లు, మధిర నియోజక వర్గంలోని బోనకల్ మండలం సిరిపురం గ్రామంలో పాఠశాల వేగంగా నిర్మాణంలో ఉందని తెలిపారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు జూన్ 2 నుండి అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నట్లు, వారంలో మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావ అందించనున్నట్లు తెలిపారు.
Also Read: బీజేపీ మహిళలను మోసం చేస్తోంది.. జనగణనలో బీసీ లెక్కలు తేలాలి: కల్వకుంట్ల కవిత
ఇకపై ఒక్క విద్యార్థి కూడా ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించామని, ఈ పాఠశాలల్లో ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, యూనిఫాం, పుస్తకాలు, నాణ్యమైన విద్య అందిస్తారని తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతులు తమ పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు ఇకపై ఆదా అవుతుందని చెప్పారు.ప్రజాపాలనలో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 8వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న బాలురు, బాలికలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా మొత్తం 648 సైకిళ్లను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు భారీగా వ్యయం చేస్తోందన్నారు.
ఖమ్మం జిల్లాలో 5 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించ నున్నట్లు, అదే విధంగా ప్రతి నియోజక వర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అలాగే ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఎఫ్.ఆర్.ఎస్ హాజరుశాతంలో విద్యార్థులు, సిబ్బంది పరంగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా డిప్యూటీ సీఎం మార్గదర్శకత్వంలో ఖమ్మం విద్యాశాఖ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Also Read: ఐదేళ్లుగా నిద్రపోతున్న వ్యవసాయ శాఖ.. ఆటకెక్కిన భూసార పరీక్షలు