Employee Transfers: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకే చోట మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీకి అర్హులని, నాలుగు సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2027 మే నెలాఖరు లోపు పదవి విరమణ చేసే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుందని, ఒక కేడర్ లో 40 శాతాన్ని మించి బదిలీలు చేయరాదని తెలిపింది.
స్పౌస్ కేసులు, త్వరలో రిటైర్ అయ్యే ఉద్యోగులు, దివ్యాంగులు, మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులు, ఒంటరి వారు, మెడికల్ కేసులు, హార్డ్‌షిప్ ఏరియాల్లో ఎక్కువకాలం పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముందుగా అన్ని ఖాళీలను ప్రకటించి ఆ తర్వాత బదిలీ కోసం ఉద్యోగుల నుంచి గరిష్టంగా 5 ఆప్షన్స్ తీసుకోనున్నారు. ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడతారు. అవసరమైతే హార్డ్‌షిప్ పోస్టులకు లాటరీ విధానం అమలు చేస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి బదిలీల ప్రక్రియ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మే ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఖాళీలు, బదిలీ అయ్యే ఉద్యోగుల వివరాల విడుదల చేస్తారు. మే ఎనిమిదో తేదీ నుంచి 15 వరకు ఐచ్చికాలతో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 16 నుంచి 24 వరకు పరిశీలన, కౌన్సెలింగ్, మెరిట్ జాబితా తయారీ చేస్తారు. మే 25 నుంచి 31 వరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన మూడు రోజుల్లో రిలీవ్ అయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ ఒకటో తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: వివాదంలో అభిషేక్ శర్మ..పాకిస్తాన్ బౌలర్ తో డ్రెస్సింగ్ రూంలో చర్చలు !
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయడం ఉద్యోగులకు కొంత ఊరట లభించిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పేర్కొన్నారు. ఆర్ధికశాఖ విడుదల చేసి జీఓ నం.38 ప్రకారం మూడేళ్లు నిండిన వారికి మాత్రమే బదిలీలకు అవకాశం ఇచ్చారన్నారు. ఇది కాకుండా దీనిని రెండేళ్లకు కుదించాలని కోరారు. దీంతో చాలా మంది ఉద్యోగులకు బదిలీలకు అవకాశం లభిస్తుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్నింటిని మార్చాలని కోరారు. ట్రాన్స్‌ఫర్లు 1మే , 2026 నుండి 31 మే 2026 వరకు మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
ఈ ప్రక్రియకు రెండు నెలల పాటు అవకాశం కల్పించాలన్నారు. ఒకే స్థలంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు ట్రాన్స్‌ఫర్‌కు అర్హులుగా అవకాశం కల్పించారన్నారు. దీనిని రెండేళ్లకు కుదించాలని కోరారు. ఒక కేడర్‌లో గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే బదిలీలు చేపట్టాలని ఆదేశించిందన్నారు. ఈ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా భార్యాభర్తల కేసులు, త్వరలో రిటైర్ కానున్న ఉద్యోగులు, దివ్యాంగులు, విధవలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు.
క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, హార్ట్ సర్జరీ వంటి వైద్య కారణాలను ప్రత్యేకంగా పరిగణించడం చాలా మంచి ఆలోచనగా తెలిపారు. ట్రాన్స్‌ఫర్లను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఖాళీల జాబితాను ముందుగా ప్రకటించి ఉద్యోగుల నుండి గరిష్టంగా ఐదు ఆప్షన్లు తీసుకోవడం వంటి నిర్ణయం చాలా బాగుందన్నారు. కౌన్సెలింగ్ విధానంలో బదిలీలను చేపడితే మరింత పారదర్శకంగా సాగుతుందన్నారు.
Also Read: పిక్చర్ ఇంకా బాకీ ఉంది.. సంబరపడొద్దు.. BRSకు చామల స్ట్రాంగ్ వార్నింగ్