Rythu Bharosa News: పథకాలను అమలు చేసేటప్పుడు ప్రచారం చేయాలి ఆయా ప్రభుత్వాలు. లేకుంటే దానికి సంబంధించి లబ్దిదారులకు ఎలాంటి సమాచారం తెలీదు. దానివల్ల లబ్దిపొందలేరు. రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దాని ప్రకారం శుక్రవారం రైతుల ఖాతాల్లో 36 వేలు రూపాయలు పడనుంది.
రైతు భరోసా పథకానికి సంబంధించి గడిచిన నాలుగైదు రోజులు నిధులు జమ చేస్తోంది రేవంత్ సర్కార్. ఐదు ఎకరాల రైతులకు రైతు బరోసా కింద నిధుల విడుదల చేసింది. ఎకరాకు ఆరువేల చొప్పున ఐదు ఎకరాలకు 30 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 43వేల 167మంది రైతులకు లబ్ధి చేకూరింది. దీనికోసం 1189. 43 కోట్ల నిధులను విడుదల చేసింది.
దీంతో ఇప్పటివరకు 62 లక్షల రైతులకు లబ్దిచేకూరింది. శుక్రవారం 6 ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేయనుంది ప్రభుత్వం. యాసంగి సీజన్‌కి ఈ పథకం కింద ఎకరానికి రూ.6,000 అందచేస్తోంది. దాని ప్రకారం 6 ఎకరాలు ఉన్న అన్నదాతల అకౌంట్లలో రూ.36,000 జమ కానుంది.
ఈ విషయాన్ని స్వయంగా ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేదానితో సంబంధం లేదు. సాగుకు అనుకూలంగా భూమి ఉన్న రైతుకు డబ్బు ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రతీ పొలానికీ రైతు భరోసా వస్తుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ స్కీమ్‌కు సంబంధించి సోమవారం 2 ఎకరాలున్న రైతులకు అకౌంట్లలో డబ్బు జమ చేశారు.
ALSO READ: హైదరాబాద్ లో ఆ ప్లేస్ అంటే భయం
మంగళవారం నాడు 3 ఎకరాలు, బుధవారం రోజు 4 ఎకరాలు, గురువారం నాడు 5 ఎకరాల రైతులకు డబ్బు జమ చేశారు. శుక్రవారం 6 ఎకరాల రైతులకు నిధులు వారి అకౌంట్లలో జమ చేయనుంది. శనివారం- 7 ఎకరాలు ఉన్న రైతులకు, ఆదివారం- 8 ఎకరాలు, సోమవారం- 9 ఎకరాలు, మంగళవారం-10 ఎకరాలు, పైనున్న రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేసేలా ప్లాన్ చేసింది.
9 రోజుల్లో ఈ పథకం కింద నిధులు పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక రెడీ చేసుకుంది. 70 లక్షల 11 వేల 984 మంది రైతుల అకౌంట్లలో 9 వేల కోట్ల నిధులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. అర్హులైన రైతులకు నిధులు రాకపోతే దగ్గర్లోని వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ను సంప్రదించాలి. రైతు భరోసా డబ్బులు రాలేదని చెబితే చాలు. వాటిని పరిశీలించి డబ్బు పడలేదని గుర్తిస్తారు.
ఆ తర్వాత దరఖాస్తు ఫారం రైతుకు ఇస్తారు. రైతు పేరు, ఆధార్ ఐడీ, మొబైల్ నెంబర్, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి వుంటుంది. ఎన్ని ఎకరాల పొలం ఉంది అనేది మెన్షన్ చేయాలి. వాటిని నింపిన తర్వాత పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాలి.
నింపిన దరఖాస్తు ఫారం వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ కు అందజేయాలి. మీరు ఇచ్చిన అన్నింటినీ చెక్ చేసి అంతా బాగుంది అనుకుంటే జిల్లా అధికారులకు పంపిస్తారు. త్వరలోనే రైతు అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. ఆన్‌లైన్‌లోకి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే మీ-సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేయించుకోవచ్చు.