Hyderabad Tourism: ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని ఓ ప్రాంతం.. ఇప్పుడు నగరాన్ని ఆశ్చర్యపెట్టేలా మారబోతోంది. ప్రకృతి సోయగాలతో, ప్రశాంతతను పంచే అందాలతో, స్థానికుల మనసులను మెప్పించేలా ఒక కొత్త ప్రదేశం రూపుదిద్దుకుంటోంది. సాయంత్రం వేళల నడకలు, కూల్ వాతావరణం, కుటుంబ సమేతంగా విహరించడానికి ఇలాంటి చోటు కావాలనుకునేవాళ్లకు ఇది నిజంగా ఓ మంచి వార్తే. అధికారుల చొరవ, శాఖల సమన్వయం, సమాజం భాగస్వామ్యం ఇలా అన్నీ కలసి ఒక కొత్త హరిత కోణం అందుబాటులోకి రానుంది. ఇంకా ఇదేం ప్రదేశమో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి!
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి చెరువు ఇప్పుడు కొత్త రూపు దాల్చనుంది. ఇంతకాలం నిర్లక్ష్యంగా కనిపించిన ఈ చెరువును ఇప్పుడు సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. చర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న ఈ 58 ఎకరాల చెరువును అందంగా తీర్చిదిద్దేందుకు జైళ్ల శాఖ, హైడ్రా, స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి కార్యాచరణ ప్రారంభించారు. గురువారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువును సందర్శించి, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం చెరువులో కొంతమేర నీరు ఉన్నా, అది పరిశుభ్రంగా ఉండటంతో జీవవైవిధ్యం పెరుగుతోంది. అయితే, నీటి నిల్వ పూర్తిగా పెరిగితే చెరువు మరింత ఆహ్లాదకరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. దీంతో పాటు చెరువును పర్యాటక, విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, పాత్‌వేను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇది పూర్తయితే దాదాపు 3 కిలోమీటర్ల నడకదారి అందుబాటులోకి రానుంది.
ఈ మార్పుల్లో కీలక అంశంగా నిలిచింది భద్రత. సోలార్ లైటింగ్ వ్యవస్థతో పాటు, చెరువు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మురుగు నీరు చెరువులోకి చేరకుండా ప్రత్యేకంగా డైవర్ట్ నాలాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే, చెరువు ప్రాంతాన్ని పచ్చదనం పంచే మినీ పార్కులు, చెట్లు, విశ్రాంతికి సీటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Also Read: Hyderabad New Flyover 2025: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్.. ఇక రైడింగ్ వేరే లెవెల్ బాస్!
ఇవన్నీ కలిసి స్థానికులకు ప్రయోజనం కలిగించడంతో పాటు, హైదరాబాద్‌కు మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం కలిగించనున్నాయి. ముఖ్యంగా జైలు ప్రాంతానికి సమీపంలో ఉండే ఈ చెరువు, భద్రతతో పాటు ప్రకృతి అందాలను కూడదీసుకునేలా మారనుంది. చర్లపల్లి పరిశ్రమల ప్రతినిధులు కూడా తమ సామాజిక బాధ్యత (CSR) కింద నిధులు సమకూర్చడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఎంత ఖర్చు అవుతుందో సమగ్ర నివేదిక ఇస్తే, ఆ ఆధారంగా నిధులు సేకరించేందుకు వీలవుతుందని సౌమ్య మిశ్రా చెప్పారు.
ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలను జైళ్ల శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో చూపించారు. హైడ్రా అగ్నిమాపక శాఖ అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటికే ఈ చెరువుకు హకీంపేట నుంచి నాగిరెడ్డికుంట, కాప్రా చెరువు, మోతుకులకుంట, బైసన్‌కుంట వంటి గొలుసుకట్ట చెరువుల ద్వారా మంచి నీరు అందుతోంది. ఈ అనుసంధానంతో చెరువు ఎప్పుడూ నిండుగా ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు, అడ్వాన్స్ ప్లానింగ్‌తో చెరువులో మంచినీరు నిలిపే చర్యలను వేగవంతం చేయాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాన్ని కమిషనర్ రంగనాథ్ సూచించారు.
మొత్తం మీద చూస్తే, చర్లపల్లి చెరువు త్వరలోనే చెరువుగా మాత్రమే కాకుండా, ప్రకృతిని ఆస్వాదించేందుకు, కుటుంబంతో సేద తీరేందుకు, ఆరోగ్యంగా నడక కోసం పర్యావరణ పథంగా మారనుంది. ఇది అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో కొత్త ఐకానిక్ స్పాట్‌గా నిలిచే అవకాశముంది.