Manmohan Singh :
⦿ అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో ప్రతిపాదనలకు అవకాశం
⦿ మన్మోహన్ హయాంలోనే తెలంగాణ కల సాకారం
⦿ ఆయన కృషి, చొరవను కీర్తిస్తూ ప్రభుత్వ తీర్మానం
⦿ అన్ని పార్టీల అభిప్రాయాల అనంతరం ఆమోదం
⦿ సమావేశానికి కేసీఆర్ హాజరుపై ఆసక్తికర చర్చ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మృతిగా తెలంగాణ సచివాలయం సమీపంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త పథకానికి ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఢిల్లీలో జరిగిన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30న ప్రత్యేకంగా జరగనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సభ్యులందరికీ సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ ఎదురుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం, మరికొద్ది దూరంలో ఇందిరా గాంధీ విగ్రహం ఉన్నాయి. ఆ తరహాలోనే మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలనే తీర్మానానికి అసెంబ్లీలో ఆమోదం లభిస్తే దానికి అనువైన స్థలాన్ని గుర్తించే కసరత్తు మొదలవుతుంది.
కేసీఆర్ హాజరవుతారా?
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కొంతకాలం కేంద్ర మంత్రిగా, ఆ తర్వాత ఎంపీగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేక సెషన్‌కు హాజరవుతారా అనే చర్చ మొదలైంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో చర్చకు రావడం, ఆమోదం పొందిందనే అంశాన్ని బీఆర్ఎస్ నేతలే ప్రస్తావించారు. ఆయనతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని వివరించడానికి కేసీఆర్ ఈ ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు హాజరు కావడంపై జోరుగా చర్చ జరుగుతోంది. బడ్జెట్ ప్రసంగం రోజు మినహా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ, ఇప్పుడు మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు ప్రత్యేక సెషన్ జరుగుతున్నందున గత జ్ఞాపకాలను గుర్తుచేసుకునేందుకు కేసీఆర్‌కు ఇది ఒక మంచి అవకాశమనే వాదనలు తెరపైకి వచ్చాయి.
మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రంతో మన్మోహన్ సింగ్‌కు ఉన్న అనుబంధంతో పాటు ఆర్థిక వేత్తగా ప్రధాని హోదాలో 2004 – 14 మధ్యకాలంలో, దానికి ముందు 1991 – 96 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, దేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఈ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానంలో ఆయన దూరదృష్టిని, నిరాడంబరతను, మాటలు తక్కువ, చేతలెక్కువ తరహాలో స్టేట్మెంట్‌ను సభ ముందు ఉంచే అవకాశమున్నది. అన్ని పార్టీల సభ్యులకు ఆయన గురించి మాట్లాడే అవకాశం దక్కనున్నది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం మన్మోహన్ సింగ్ పట్ల సానుకూలంగా ఉన్నందున ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతు తెలపడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆయన పోషించిన పాత్రను ప్రస్తావించే అవకాశమున్నది.