Jagtial District: జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన దారుణ ఘటనలో ఏడేళ్ల బాలుడు కుంట దినేశ్ నీటి గుంతలో పడి మృతి చెందాడు. కల్లెడ గ్రామంలోని దినేశ్ అనే బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు కుంట భూమయ్య కుమారుడు.
తీరని విషాదం..
అయితే భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. అయితే ఇదిలా ఉండగా, గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో ఓ జేసీబీ నిర్వాహకుడు అనుమతి లేకుండా మట్టి తోడేందుకు భారీ గుంతలు తవ్వి అలాగే వదిలేశాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలు పూర్తిగా నీటితో నిండిపోయాయి, ఫలితంగా నీటి ప్రవాహం ఏర్పడింది. దినేశ్‌తో పాటు మరో ముగ్గురు చిన్నారులు నీటిలో ఆడుకుంటూ అటువైపు వెళ్లారు. ప్రమాదవశాత్తు దినేశ్ గుంతలో జారి పడిపోయాడు.
అనుమతి లేకుండా మట్టి తోడినందుకు గ్రామస్తుల ఆరోపణ..
స్థానికులు తక్షణమే వెదికినా, బాలుడు అప్పటికే మరణించాడు. ఈ సంఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం జేసీబీ నిర్వాహకుడి నిర్లక్ష్యం. అతడు మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో బండరాళ్లు, మట్టి తోడుతూ పెద్ద ఎత్తున గుంతలు తవ్వుతున్నాడు. గత రెండు-మూడు సంవత్సరాలుగా ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని, దీని వల్ల పశువులు సైతం గుంతల్లో పడి మృతి చెందుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Also Read: వైసీపీకి గుబలు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ..
అధికారుల నిర్లక్ష్యం..
అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జేసీబీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.