Telangana Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ , తొమ్మిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మరో ఐదు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఐదు జిల్లాల్లో అతి భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. వాటిలో హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్ , యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
తొమ్మిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాటిలో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.
ఇక ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఓవరాల్ గా పరిశీలిస్తే తెలంగాణలోని 33 జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
ALSO READ: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్, నలుగురు మంత్రులతో కమిటీ
భారీ వర్ష సూచనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు నేడు, రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.
గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో సూళ్లకు నేడు, రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని పేర్కొంది.
ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుక కావడంతో ఆరోజు పాఠశాలలకు సెలవు రానుంది. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్ మంత్రులు, అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. అలాగే హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
మరోవైపు ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ మేరు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలతో రోడ్లు జలమయం, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని భావించి ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.