Siricilla District Collector: ఒక అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కోర్టులు ఎలా స్పందిస్తాయో చూపించిన ఘటన నిన్న తెలంగాణ హైకోర్టులో జరిగింది. సామాన్యులకు ఆమడ దూరంలోనే న్యాయం ఆగిపోతుందనే అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది కోర్టు. అధికారులకు భయపడకుండా పోరాటం చేస్తే న్యాయం ఎవరికైనా అందుబాటులోనే ఉంటుందని రుజువు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన కవిత అనే మహిళ మిడ్ మానేరులో తన ఇల్లు పోయిందని.. తనకు పునరావాసం కల్పించాలని కోరుతూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బాధితురాలికి పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో బాధితురాలు కోర్టు తీర్పు ప్రకారం న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరింది. అయితే.. కోర్టును తప్పుతోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో కవితపై జిల్లా సందీప్ కుమార్ ఝా క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆమెపై కేసు నమోదు చేశారు.
దీంతో బాధితురాలు ఏ మాత్రం భయపడకుండా మరోసారి కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలను అమలు చేయకపోగా.. తిరిగి క్రిమినల్ కేసులు పెట్టారని కోర్టుకు వివరించారామె. దీంతో కోర్టు తీర్పును ధిక్కరించండమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌పై హైకోర్టు సీరియస్ అయింది.
బుధవారం తమ ఎదుట హాజరుకావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. కానీ.. కోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు. దీంతో న్యాయం స్థానం మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని.. లేదంటే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టు వార్నింగ్ తో నిన్న మధ్యాహ్నం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా న్యాయం స్థానం ఎదుట హాజరయ్యారు. 2 గంటల పాటు ఆయన్ని కోర్టులో నిల్చోపెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. తామిచ్చిన తీర్పును ఎలా తప్పుపడతారని నిలదీశారు. బాధితురాలిపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. మరో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్
కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అని కలెక్టర్‌ను ప్రశ్నించింది న్యాయస్థానం. దీంతో తాను చేసింది తప్పేనని కలెక్టర్ ఒప్పుకొని భేషరతుగా క్షమాపణలు చెప్పారు. కోర్టు తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పి తీర్పును వాయిదా వేశారు. ఇప్పుడు ఈ కేసులో తీర్పు ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది.