High Court Serious: రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. ఆ ప్రాంతంలో ఎందులోకి వస్తుందని అనే తేడా తెలుసుకోకుండా పర్మీషన్లు ఇచ్చేశారు. పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం బిల్డర్లు, వినియోగదారుల వంతైంది.
ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తులను జప్తు చేస్తే తెలుస్తుందంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసింది. బఫర్ జోన్ అని తెలిసి నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ అధికారులపై రుసరుసలాడింది. అసలేం జరిగింది.. ఇంకా కేసు లోతుల్లోకి వెళ్తే..
శంషాబాద్ ప్రాంతంలోని నార్కుడ గ్రామానికి చెందిన సచిన్ జైస్వాల్ తోపాటు మరికొందరు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారు. వాటిని తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు కొంతమందికి నోటీసులు జారీ చేశారు. అందులో పలువురు వాటిని సవాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలో బుధవారం న్యాయస్థానంలో వాదోపవాదనలు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులే కూల్చివేస్తామంటే ఎలా అంటూ ప్రశ్నించింది హైకోర్టు. అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు కూల్చినందుకు ప్రభుత్వాలు ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ALSO READ: అసెంబ్లీకే కాదు.. దానికి కూడా డుమ్మా, బొత్తిగా క్రమశిక్షణే లేదే!
అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం చెల్లించాలని ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు రెండువారాల్లో అన్ని ఆధారాలతో సమాధానాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా నోటీసులపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని ఆదేశిస్తూ పిటిషన్ విచారణను క్లోజ్ చేసింది న్యాయస్థానం.