Inter Practical Exams: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 2 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రాక్టికల్స్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొత్తం 5.26 లక్షల మంది స్టూడెంట్లు హాజరవ్వనున్నారు. ఇందులో ఎంపీసీ(MPP) విద్యార్థులు స్పెల్ 1 లో 1,35,474 మంది, స్పెల్ 2లో 1,38,533 మంది కలిపి మొత్తం 2,74,007 మంది పరీక్ష రాయనున్నారు. బైపీసీలో స్పెల్ 1లో 72,282 మంది, స్పెల్ 2కు 61,133 మంది కలిపి మొత్తం 1,33,415 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వొకేషనల్ విద్యార్థులు స్పెల్ 1కు 75,160 మంది, స్పెల్ 2కు 43,610 మంది కలిపి మొత్తం 1,18,770 మంది పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కృష్ణ ఆదిత్య తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1440 సాధారణ ప్రాక్టికల్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. 7559 మంది ఎగ్జామినర్లను నియమించినట్లు చెప్పారు. ప్రాక్టికల్స్ ప్రతిరోజూ రెండు పూటలా జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందన్నారు. అన్ని పని దినాల్లో ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కృష్ణ ఆదిత్య వెల్లడించారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ల్యాబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
Also Read: Smartphone Comparison: వివో X200T vs ఐకూ 13 vs రియల్మీ GT 7 ప్రో.. రూ.60,000లో ఏది బెస్ట్?
వీటిని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించామని, అక్కడి నుంచే పరీక్షల నిర్వహణను లైవ్ మానిటరింగ్ చేస్తామని తెలిపారు. జిల్లాల్లో హైపవర్ కమిటీలు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ల నుంచి మొత్తం 7,559 మంది ఎగ్జామినర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. వీరి నియామకపు ఉత్తర్వులను పారదర్శకత కోసం సీజీజీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే జారీ చేశామన్నారు. ఇదిలా ఉండగా ప్రాక్టికల్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే కాలేజీల లాగిన్లలో అందుబాటులో ఉంచామని, విద్యార్థులకు ఆ లింక్ పంపించినట్టు చెప్పారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు 92402 05555 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షలకు సహకరిస్తున్నారని వివరించారు. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ కు ల్యాబ్ ఎక్విప్మెంట్, పరికరాలు సిద్ధం చేశామన్నారు.
గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఎగ్జామినర్లకు పేమెంట్స్ విషయంలో ఇబ్బంది తలెత్తకుండా ఆన్ లైన్ పద్ధతిలో చెల్లిస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రాక్టికల్స్ కు ప్రభుత్వ కాలేజీల్లో జంబ్లింగ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రైవేట్ కాలేజీల్లోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ లెక్చరర్లను వాటిలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా పంపిస్తామని వివరించారు. ప్రాక్టికల్స్ పాసవ్వాలంటే కనీసం 12 మార్కులు రావాలన్నారు. గతంలో ఫెయిల్ అయిన వారు 400 మంది బ్యాక్ లాగ్ విద్యార్థులు ఫీజు చెల్లించారని కృష్ణ ఆదిత్య వివరించారు. ఇదిలాఉండగా వచ్చే విద్యాసంవత్సరం ఇంటర్ లో 20 శాతం సిలబస్ మార్పు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు బీ రాహుల్, యువరాజ్ మర్మట్, ఇంటర్ బోర్డు సీఓవో జయప్రదబాయి, జాయింట్ సెక్రెటరీలు మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీసీ – 2,74,007
బైపీసీ – 1,33,415
వొకేషనల్ 1,18,770
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు మరో అరుదైన ఆహ్వానం.. ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలంటూ లేఖ