Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూనే ఉన్నామని భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగులకు ఏదో తీరుగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర విద్యుత్ శాఖలో రిక్రూట్ అయిన 92 మంది జూనియర్ అసిస్టెంట్, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్ లకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావులు ఉద్యోగ నిమామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజ కోసం పనిచేస్తుందన్న డిప్యూటీ సీఎం.. పనికిరాని కామెంట్లు చేస్తూ ప్రతిపక్షం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు.
తొలుత రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరావు.. విద్యుత్ శాఖలో చేపట్టిన నూతన ఉద్యోగాల నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. 100 పోస్టులకు 2023 లో నోటిఫికేషన్ వచ్చిందన్న డిప్యూటీ సీఎం.. వివిధ కోర్టు కేసుల కారణంగా 8 పోస్టులు హోల్డ్ లో ఉన్నాయని తెలిపారు. దాంతో.. మిగతా 92 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామంటూ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నెల నియామక పత్రాలు ఇస్తూనే ఉన్నమని, అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధీ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.
విద్యుత్ శాఖలో సంస్కరణలు..
రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్ ను సమర్థవంతంగా తీర్చుతున్నామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. విద్యుత్ శాఖలోని సవాళ్లను ఎదుర్కొంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, గరిష్ఠ డిమాండ్ ఉన్న సమయాల్లోనూ నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల్లో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ త్వరలోనే సాకారం కానుందని తెలిపిన భట్టి విక్రమార్క.. ఫ్యూటర్ సిటీ అందుబాటులోకి వస్తే.. 29,440 మెగా వాట్ల డిమాండ్ ఉండనుందని తెలిపారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే.. 31,809 మెగా వాట్ల డిమాండ్ ఉండనుందని.. దానికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పాలనలో పాలసీనే లేదు..
గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఎనర్జీ పాలసీ అంటూ లేదని, అందుకే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేసినట్లు తెలిపారు. 20 వేల మెగా వాట్ల ఆల్ట్రానేటివ్ ఎనర్జీ ఉత్పత్తిని 2030 వరకు సాధించాలని. 2035 వరకు 30 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. 2035 నాటికి.. 40వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. కాంగ్రెస్ పాలనపై ఏదో మాట్లాడుతున్నారని, వారి పాలనలో ప్రజలను భ్రమల్లో పెట్టి కాలం వెళ్లదీశారని విమర్శించారు. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని మాట్లాడే వాళ్లు.. ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ, రూ. 500 లకు గ్యాస్ సిలెండర్, మహిళలకు ఉచిత బస్.. ఇవ్వన్నీ ఇచ్చింది కాంగ్రెసే అని తెలియదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని, బీఆర్ఎస్ పార్టీది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు కట్టకుండా వదిలి వెళ్లిన సొమ్ముల్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే క్లియర్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం.. రూ. 7,620 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు పదేళ్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్ స్టేషన్లు.. ఏఏ ప్రాంతాల్లో నిర్మించనున్నారు అంటే..
సోషల్ మీడియా చేతిలో పేట్టుకొనీ ఏది పడితే అది ప్రచారం చేస్తున్నారని మండి పట్ట భట్టి విక్రమార్క.. ప్రజలెవరు వాళ్లను నమ్మే పరిస్థితుల్లో లేరంటూ వ్యాఖ్యానించారు. మేము మీలాగా తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నగరాభివృద్ధి కోసం బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించినట్లు తెలిపిన భట్టిి విక్రమార్క.. గత ఏడాది రూ. 40 వేల కోట్లు దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది.. పెట్టుబడుల లక్ష్యాల్ని రూ.లక్ష కోట్లుగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.