Minister Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని, దీనికి మరోవైపు బిజేపీ నేతలు వంతపాడుతున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, రామ సహాయం రఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డితో కలసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. 2023 జూలై 15న వెలుగుమట్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టిందన్నారు.అంతేగాక వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసింది. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇస్తామన్నారు. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పెటెంట్ అంటూ మంత్రి వివరించారు. కానీ బీఆర్ఎస్లోని బావ మరుదులు, ఫాంహౌస్ లోని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. పదేళ్ల పాటు కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుందన్నారు.
Also Read: Hanuman: హనుమంతుడే మొదటి రామాయణ కర్తా? హనుమద్ రామాయణం వెనక ఉన్న అసలు రహస్యం!
వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కారణంగా బీటలువారడం కూడా జరిగిందన్నారు. నాలుగేళ్లలో 168 టిఎమ్‌సీ నీరు ఇస్తామని చెప్పి దీనిలో 50 టిఎంసీల నీటిని సముద్రం పాలుచేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బిఆర్ఎస్ కు ఎటీఎం గా మారిందన్న బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో చేతులు కలిపారన్నారు. జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్ట్ లను మేం పూర్తి చేస్తున్నామన్నారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీకి కేసీఆర్, బావ బావమరుదులు వచ్చి మాట్లాడాలన్నారు. వారు గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.తాము కచ్చితంగా అవకాశం ఇస్తామన్నారు. వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. 196 టీఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టీఎంసీలకు పరిమితం చేసిందన్నారు. 50 టీఎంసీలు సముద్రంలో కలిపిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం ఇచ్చామన్నారు. కాళేశ్వరంపై చర్చించామన్నారు.కేంద్రం చర్యలు కోరామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 48వేల కోట్లు మిత్తీగా కట్టిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇకనైనా నిధులు ఇవ్వాలి అని కోరారన్నారు. మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడినందును దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా ధనిక పార్టీగా మారిందన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయిల ఫిక్స్‌డ్ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని కేసీఆర్ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంట్రాక్టర్లు, కాసుల కోసమే బిఆర్ఎస్ అనుకూల నీటిప్రాజెక్ట్‌లను చేపట్టిందన్నారు.
Also Read: Hanuman: హనుమంతుడే మొదటి రామాయణ కర్తా? హనుమద్ రామాయణం వెనక ఉన్న అసలు రహస్యం!