CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగంలో.. సమూల మార్పులు తేవాలని నిర్ణయించారు. తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన రాష్ట్ర నూతన విద్యా విధానం (New Education Policy) పై సమగ్రంగా చర్చించారు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయడం, పేదరిక నిర్మూలనకు దోహదం చేయడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించడం.. తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
సమూల మార్పుల అవసరం
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేయక తప్పదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం పేదరిక నిర్మూలనలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. అందుకే మేము సమూల మార్పులపై దృష్టి పెట్టాం అని అన్నారు.
గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు తెలంగాణ విద్యా అభివృద్ధికి కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తుచేశారు. కానీ, గ్లోబలైజేషన్, ఓపెన్ మార్కెట్ కారణంగా రాష్ట్ర విద్యా విధానం.. అంతర్జాతీయ స్థాయికి సరితూగలేకపోతోందని తెలిపారు.
ఉపాధి అవకాశాల లోపం
ప్రతి సంవత్సరం తెలంగాణలో దాదాపు 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నప్పటికీ, వారిలో కేవలం 15 శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయనే వాస్తవాన్ని సీఎం ప్రస్తావించారు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ఈ లోపాన్ని అధిగమించడానికి కొత్త విధానంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ ఖర్చులు – ఫలితాల లోపం
రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు 21 వేల కోట్ల రూపాయలు కేటాయించినా, అందులో 98 శాతం జీతాలకే సరిపోతాయని సమస్యను సీఎం స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్యే ప్రధాన మార్గమని, విద్యా రంగంలో పెట్టుబడులను.. సరైన విధంగా వినియోగించడం అత్యవసరమని పేర్కొన్నారు.
ప్రైవేట్ – ప్రభుత్వ పాఠశాలల పోలిక
తెలంగాణలో ప్రస్తుతం 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో.. 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మంది విద్యార్థులే చదువుతున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ విద్యా రంగం బలహీనతను స్పష్టంగా చూపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత పెంచి, పిల్లలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రానికి అభ్యర్థన
విద్య కోసం రాష్ట్రాలు తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్ బీ ఎం (FRBM) పరిమితుల నుంచి.. మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు సీఎం వెల్లడించారు. దీనివల్ల విద్యా రంగంలో పెట్టుబడులు పెంచి, మరిన్ని సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.
కొత్త విద్యా విధానం – భవిష్యత్ దిశ
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు.. పూర్తిగా కొత్త విధానం తీసుకురావాలని సీఎం సంకల్పించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తేవడమే తమ ప్రధాన ఉద్దేశమని, ఇందుకోసం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.
73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడం, దేశ విద్యా విధానాన్ని ప్రభావితం చేసేలా తెలంగాణ కొత్త విద్యా విధానాన్ని రూపొందించడం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
Also Read: రియల్ ఎస్టేట్ లో ఫ్రీ లాంచ్ ఆఫర్లతో భారీ మోసం..
పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సమూల మార్పులకు సిద్ధమైంది. విద్యా విధానం కేవలం చదువులోనే కాకుండా, ఉపాధి, పేదరిక నిర్మూలన, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం కలిగించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో విద్యా రంగంలో పలు కీలక సంస్కరణలు చోటుచేసుకోనున్నట్లు సంకేతాలిస్తున్నాయి.