Nirmala Sitharaman: దేశవ్యాప్తంగా జీఎస్టీపై ప్రజలు రకరకాలు చర్చించుకుంటున్నారు. కొత్త పన్ను సంస్కరణల వల్ల రేట్లు తగ్గుతాయని కొందరు అంటున్నారు. ఒక దాంట్లో తగ్గించి మరొక చోట పెంచడం ఖాయమని మరికొందరి మాట. దీనిపై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారతీయుల చేతుల్లో రూ.2 లక్షల కోట్లు రాబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఏ విషయంలో మంత్రి అన్నారు? అంటూ కొత్త చర్చకు దారి తీశారు.
జీఎస్టీలో కొత్త పన్ను సంస్కరణలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై సామాన్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రేట్ల తగ్గింపు వల్ల కనీసం నెలకు వెయ్యి రూపాయలు మిగులుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన కొత్త పన్ను సంస్కరణలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ.
ఈ క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రోజు తప్పించి రోజు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పన్నుల తగ్గింపు రాష్ట్రానికే కాకుండా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం విశాఖ వెళ్లిన ఆమె, జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
జిఎస్‌టి కొత్తతరం పన్నుల వల్ల భారతీయల చేతుల్లోకి 2 లక్షల కోట్లు రానున్నట్లు లెక్కకట్టారు విత్త మంత్రి. ఆమె ఏ విధంగా ఆ నిధులు వస్తాయో ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. 12 శాతం స్లాబులో ఉన్న 99 శాతం వస్తువులు కొత్తగా 5 శాతం స్లాబ్ కిందకు వస్తాయన్నారు. దీనివల్ల మధ్యతరగతి, పేదలకు ప్రయోజనం చేకూరుతుందని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు.
ALSO READ: సామ్‌సంగ్ గెలాక్సీ-ఎ 37 5జి మిడ్ రేంజ్‌లో మాస్టర్ ఫోన్
2017-18 ఏడాదిలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 2024-25 నాటికి రూ.22.08 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామని చెప్పిన సీతారామన్, పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను ప్రస్తుతం సున్నా శాతానికి తీసుకొచ్చామన్నారు.
28 శాతం స్లాబులో ఉండే సిమెంట్ సహా 90 శాతం వస్తువులు 18 శాతం పరిధిలోకి తెచ్చామని వివరించారు. జీఎస్టీ కొత్త రకం పన్నులపై కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత జీఎస్టీ తగ్గించాలని గుర్తు వచ్చిందా? మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సూటిగా ప్రశ్నించారు.
ఇప్పటివరకు తగ్గించే వస్తువుల జాబితాను బయటపెట్టారు. చాలా వస్తువులను 12 స్లాబులో ఉన్నవాటిని 18 శాతానికి మార్చినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ జాబితా బయటకు రాలేదు. దీనిపై విత్త మంత్రి ఏమంటారో చూడాలి.