phone tapping case latest: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా? మాజీ ఓఎస్‌డీ ప్రభాకరరావు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ క్రమంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుట్టుకోనుందా? రేపో మాపో అప్పటి రివ్యూ కమిటీలోని అధికారులను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ అధికారులను విచారిస్తారా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కావాలనే మాజీ ఓఎస్‌డీ ప్రభాకరరావు ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో తన పాత్ర లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ అంతా తాను లీగల్‌గా చేశారని, ఇల్లీగల్‌గా చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాటి రివ్యూ కమిటీ అనుమతితో చేశామంటూ కొత్త బాంబు పేల్చారు. దీంతో అప్పటి రివ్యూ అధికారుల మెడకు ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకోనుంది.
ప్రభాకర్‌రావు ఇటీవల న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. అందులో రివ్యూ కమిటీ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రివ్యూ కమిటీలోని సభ్యులు ఎవరు అనేదానిపై దృష్టి పెట్టారు విచారణ అధికారులు. ఇప్పుడు వారిని విచారణ చేయనున్నారు. అందులో సీఎస్,హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం అధికారులు ఉన్నారు.
రివ్యూ కమిటీ అనుమతితో 2023 డిసెంబరులో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం చేశామన్నారు ప్రభాకర్‌రావు. దీంతో ఈ వ్యవహారం అప్పుడు కీలకంగా వ్యవహరించిన అధికారులపై పడింది. ప్రస్తుతం ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. రేపో మాపో ఆయన ఎంట్రీ ఇస్తారని భావిస్తున్న నేపథ్యంలో రివ్యూ కమిటీ వ్యవహారం బయటకు వచ్చింది.
ALSO READ: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీలు, తరలివస్తున్న అందగత్తెలు
ఆనాటి రివ్యూ కమిటీలో ఉన్న ఉన్నతాధికారి తాము విచారిస్తామని తెలియగానే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల కిందట హోంశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో దర్యాప్తు అధికారుల తీరును ఆయన తప్పు పట్టినట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో మరో ఐపీఎస్ అధికారి అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. దర్యాప్తు అధికారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారట.
విచారణకు అధికారులు వస్తారా?
ప్రస్తుతం ఈ కేసులో రిటైర్డ్ డీసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలు, మరో డీఎస్పీని అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం శ్రవణ్‌రావును అధికారులు విచారించారు. విచిత్రం ఏంటంటే అరెస్టయిన నిందితులంతా ప్రభాకర్‌రావు వైపు అంతా చేశారని వివరించిన విషయం తెల్సిందే.
బీఆర్ఎస్ హయాంలో ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ ఓఎస్డీగా పని చేశారు. అయితే పోలీస్ శాఖ వ్యవహారాల్లో ఆయన తన స్థాయికి మించి వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు. ఏదైనా ఫోన్ నంబర్‌పై నిఘా ఉంచాలంటే ఐజీ స్థాయి అధికారికి అనుమతి ఉంటుంది. రిటైర్డ్ అయిన ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఇలా చేయడం వివాదంగా మారింది.
ఫోన్లపై రోజుల తరబడి నిఘా కొనసాగించాలనుకుంటే రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, రాజకీయనేతలు, జడ్జీలు, వ్యాపారవేత్తల ఫోన్లను రోజుల తరబడి ట్యాపింగ్ చేయించినా రివ్యూ కమిటీ ఎలా అనుమతించిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.