CS Ramakrishna Rao: ఒలింపిక్స్ 2036 కు సిద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) అధికారులకు ఆదేశాలిచ్చారు. శనివారం ఆయన కీలక శాఖలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్స్ నాటికి రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడాకారులను అధిక సంఖ్యలో తయారు చేసే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడల అభివృద్ధికి యువతను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల వైపు మరింత ఆకర్షించే విధంగా విధానాలను రూపొందించాలన్నారు.
రహదారుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమని, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అనుసంధానించే రహదారుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో చేపట్టిన పలు ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్(Warangal), ఎల్.బి.నగర్(LB Nagar), ఆల్వాల్(Alwal), సనత్ నగర్(Sanath Nagar), న్యూ ఉస్మానియా, హైకోర్టు నూతన భవనం, భవన నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట), వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు అందిస్తున్న వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రసాదాల పంపిణీ, రవాణా సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, వేములవాడ, భక్తుల రద్దీ ఉండే ఇతర ఆలయాల్లో దర్శన క్యూల నిర్వహణ, పార్కింగ్, త్రాగునీరు, టాయిలేట్స్, పరిసరాల పరిశుభ్రత నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు.
Also Read: Vangalapudi Anitha: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
వచ్చే సంవత్సరం జరిగే గోదావారి పుష్కరాలకు పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ,ఇతర మౌలిక వసతుల కల్పనకు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావారి నది తీరంలో దాదాపు 69 ప్రాంతాలలో 74 పుష్కర ఘాట్లను గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరితగతిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి తగు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను సి.ఎస్ ఆదేశించారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా చేనేత కళాకారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించాలని సూచించారు. మరోవైపు భూ భారతి రికార్డుల నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, భూ సర్వేలు, సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయ భవనాల నిర్మాణం, ఇ-ఫైలింగ్, లైసెన్స్డ్ సర్వేయర్లు, 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యసాధన, తదితర అంశాలపై సమీక్షించారు.